Govardhan Puja: గోవర్ధన పూజ ఎందుకు చేస్తారు? ఇంద్రుడి గర్వాన్ని శ్రీకృష్ణుడు ఎలా అణచాడంటే ?

Govardhan Puja: దీపావళి మరుసటి రోజు జరుపుకునే గోవర్ధన పూజకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాసం శుక్ల పక్ష పాడ్యమి రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడి రూపంగా భావించి పూజిస్తారు. ఇళ్లలో ఆవు పేడతో గోవర్ధనుడి ఆకారం తయారు చేసి పూలతో అలంకరిస్తారు. అన్నం, పప్పులు, కూరలు, స్వీట్లు సహా రకరకాల వంటకాలతో నైవేథ్యం సమర్పిస్తారు. అయితే ఈ పూజ వెనుక శ్రీకృష్ణుడు, ఇంద్రుడికి సంబంధించిన ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది.
రామసేతు నిర్మాణంతో గోవర్ధన పర్వతానికి సంబంధం
పురాణ కథనం ప్రకారం రామసేతు నిర్మాణ సమయంలో హనుమంతుడు పర్వతాలను తీసుకొస్తుండగా గోవర్ధన పర్వతాన్ని కూడా తీసుకువచ్చాడు. అయితే అప్పటికే రామసేతు నిర్మాణం పూర్తయిందని తెలియడంతో గోవర్ధన పర్వతాన్ని అక్కడే వదిలేయాల్సి వచ్చింది. దీంతో గోవర్ధనుడు శ్రీరాముడి సేవలో పాల్గొనలేకపోయానని బాధపడ్డాడట. ఈ విషయం హనుమంతుడు శ్రీరాముడికి చెప్పగా, ద్వాపర యుగంలో తాను శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు గోవర్ధన పర్వతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని భరోసా ఇచ్చినట్లు పురాణ గాథ చెబుతుంది.
ఇంద్రుడిని ఎందుకు పూజించేవారు?
బృందావనం, మథుర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రతి ఏడాది ఇంద్రుడిని పూజించేవారు. వర్షాలు కురిపించే దేవుడిగా ఇంద్రుడిని భావించి, పంటలు బాగా పండాలని ప్రార్థించేవారు. నందుడు కూడా ఇంద్రుడి పూజకు సిద్ధమవుతుండగా శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న అడిగాడు. ఇంద్రుడిని ఎందుకు పూజిస్తున్నారని తండ్రిని అడిగాడు. అందుకు నందుడు.. ఇంద్రుడు వర్షాలు కురిపిస్తే పంటలు పండుతాయని, పశువులకు పచ్చిగడ్డి దొరుకుతుందని వివరించాడు. అందుకే ఏటా ఇంద్రుడికి పూజలు చేస్తున్నామని చెప్పాడు.
ఇంద్రుడి పూజను ఆపించిన శ్రీకృష్ణుడు
నందుడు చెప్పిన కారణాలు విన్న శ్రీకృష్ణుడు ఇంద్రుడి పూజ చేయాల్సిన అవసరం లేదని బ్రజవాసులకు సూచించాడు. తమకు జీవనాధారం కల్పిస్తున్న గోవులను, అవి మేత మేసే గోవర్ధన పర్వతాన్ని పూజించాలని చెప్పాడు. దీంతో గ్రామస్థులంతా ఇంద్రుడి పూజను పక్కనపెట్టి గోవర్ధన పర్వతానికి పూజలు చేశారు. ఇది తనకు జరిగిన అవమానంగా భావించిన ఇంద్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన శక్తిని చూపించాలనే ఉద్దేశంతో బ్రజ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిపించాడు. వరదలతో గ్రామం మొత్తం నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు, పశువులు ప్రాణాలు కాపాడుకునేందుకు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కృష్ణుడు
బ్రజవాసుల కష్టాలను చూసిన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిపై ఎత్తి గొడుగులా నిలబెట్టాడు. గ్రామస్థులంతా తమ ఆవులు, ఇతర పశువులతో కలిసి ఆ పర్వతం కింద ఆశ్రయం పొందారు. పురాణ కథనం ప్రకారం ఏడు రోజుల పాటు ఇంద్రుడు వర్షాలు కురిపించినా గోవర్ధన పర్వతం కింద ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. చివరకు ఇంద్రుడికి తన తప్పు తెలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాడు. అప్పటి నుంచి గోవర్ధన పర్వతాన్ని పూజించే సంప్రదాయం మొదలైందని భక్తులు విశ్వసిస్తారు.
అన్నకూటం సమర్పణ
గోవర్ధన పూజ రోజున భక్తులు వివిధ రకాల వంటకాలను తయారు చేసి శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్ని అన్నకూటం అంటారు. కొన్ని ప్రాంతాల్లో 56 రకాల వంటకాలను సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. గోవర్ధనుడి ఆకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగిస్తారు. ఆవులకు పూజలు చేసి వాటికి ఆహారం అందిస్తారు. అన్నకూటం సమర్పిస్తే ఇంట్లో ఆహారానికి, సంపదకు లోటు ఉండదని భక్తుల నమ్మకం. ప్రకృతి, పశుసంపద, పర్వతాలను గౌరవించాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందని భావిస్తారు.
WHAT'S YOUR REACTION?
Sign in or create a free account to react.

నమూనా: ఆరోగ్యంగా ఉండటానికి సులభమైన చిట్కాలు