AP DSC 2026: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. 150 స్కూల్ అసిస్టెంట్, 200 ఎస్జీటీ పోస్టులు

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ APTRT-2026 పేరుతో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నవంబర్ 11 నుంచే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్నవారు నవంబర్ 30, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.
350 పోస్టులు.. ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు?
ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 350 ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులు 150 ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులు 200 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో నిర్దేశించిన విద్యార్హతలతో పాటు ఏపీ టెట్ అర్హత కూడా సాధించి ఉండాలి.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హతలు
స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీస మార్కుల అర్హత 40 శాతంగా నిర్ణయించారు. వీటితో పాటు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) గుర్తింపు పొందిన స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ టెట్ పేపర్-II Bలో అర్హత సాధించడం తప్పనిసరి.
ఎస్జీటీ పోస్టులకు కావాల్సిన అర్హతలు
సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులకు ఇంటర్మీడియట్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఆర్సీఐ గుర్తింపు పొందిన స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఈడీ, డీఎల్ఈడీ లేదా తత్సమాన డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు ఆర్సీఐ సీఆర్ఆర్ నంబర్ ఉండటంతో పాటు ఏపీ టెట్ పేపర్-I Bలో ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి, దరఖాస్తు ఫీజు వివరాలు
2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 49 ఏళ్లు కాగా, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. మాజీ సైనికోద్యోగులకు సాయుధ బలగాల్లో పనిచేసిన కాలంతో పాటు అదనంగా మూడేళ్ల సడలింపు ఉంటుంది. ప్రతి పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.1,000. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే ఒక్కో పోస్టుకు విడిగా ఫీజు చెల్లించాలి.
పరీక్ష, టెట్ మార్కులతో ఎంపిక
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఏపీ టెట్ స్కోరు ఆధారంగా జరుగుతుంది. మొత్తం 100 మార్కుల్లో కంప్యూటర్ పరీక్షకు 80 మార్కులు, టెట్ స్కోరుకు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఐఈఆర్టీఎస్, ఐఈడీఎస్ఎస్, కేజీబీవీల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులకు సేవా అనుభవం ఆధారంగా అదనపు మార్కులు కేటాయిస్తారు. ప్రతి పూర్తి సంవత్సరానికి 0.5 మార్కుల చొప్పున గరిష్ఠంగా 5 మార్కులు పొందవచ్చు. పరీక్షలో అర్హత సాధించేందుకు ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 30 శాతం కనీస మార్కులు సాధించాలి.
ముఖ్యమైన తేదీలు ఇవే
APTRT-2026 నోటిఫికేషన్ నవంబర్ 11, 2026న విడుదలైంది. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 30, 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. విద్యార్హతలు, టెట్ పేపర్, ఆర్సీఐ గుర్తింపు, వయోపరిమితి వివరాలను పరిశీలించిన తర్వాతే దరఖాస్తు పూర్తి చేయాలి. పూర్తి నిబంధనలు, ఇతర వివరాల కోసం ఏపీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ను చూడాలి.

Srikalahasti Temple Fire: శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన భక్తులు
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
Vijayasai Reddy New Party: 11-11-11కు ముహూర్తం.. నేడు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన
APPSC Group 1: అభ్యర్థులకు కీలక అలర్ట్.. ఇదే లాస్ట్ ఛాన్స్