Fertilizers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం

Fertilizers: రబీ పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. ఎరువులపై ఇచ్చే సబ్సిడీకి సంబంధించి కొత్త రేట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు, వాటి తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరల్లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు డీఏపీ, ఎన్‌పీకే వంటి ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులు సబ్సిడీ ధరలకు అందించేందుకు మార్గం సుగమమైంది.
మార్చి 31 వరకు కొత్త సబ్సిడీ రేట్లు
నవంబర్ 11న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 రబీ సీజన్‌కు సంబంధించి పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్) రేట్లకు ఆమోదం తెలిపారు. ఈ రేట్లు 2026 అక్టోబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. అంటే రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులపై ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం రాయితీ అందుతుంది.
ఇది కూడా చదవండి: Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
ఎరువుల సబ్సిడీ కోసం భారీగా నిధులు
ఎరువుల సబ్సిడీ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.62,370.02 కోట్లను కేటాయించింది. ఇందులో 2026-27 రబీ సీజన్‌కు రూ.37,952.29 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సబ్సిడీ కోసం అదనంగా రూ.24,417.73 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా, ఆ భారం నేరుగా రైతులపై పడకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
డీఏపీ, ఎన్‌పీకే ఎరువులకు రాయితీ
రబీ సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన డీఏపీ, ఎన్‌పీకేఎస్ సహా ఇతర ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులపై సబ్సిడీ కొనసాగనుంది. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 28 రకాల ఎరువులపై సబ్సిడీ అందిస్తోంది. అయితే ప్రతి ఎరువుపై ఇచ్చే రాయితీ ఒకేలా ఉండదు. అందులోని పోషక పదార్థాలు, ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ రేట్ల ఆధారంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: Rythu Bharosa: యాసంగి రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసాపై త్వరలోనే కీలక ప్రకటన?
ఎరువుల సబ్సిడీ ఎలా అందుతుంది?
ఎరువులపై పోషక పదార్థాల ఆధారంగా సబ్సిడీ ఇచ్చే విధానం 2010 నుంచి అమల్లో ఉంది. ఈ విధానంలో నత్రజని, భాస్వరం, పొటాష్, గంధకం వంటి పోషక పదార్థాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రేట్లను నిర్ణయిస్తుంది. ఆ మేరకు ఎరువుల తయారీ, దిగుమతి సంస్థలకు ప్రభుత్వం రాయితీ సొమ్మును చెల్లిస్తుంది. దీంతో రైతులకు ఎరువులు తక్కువ ధరకు అందించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మారినప్పుడు సబ్సిడీ రేట్లను కూడా ప్రభుత్వం సమీక్షిస్తుంది. తాజా నిర్ణయంతో రబీ సీజన్‌లో ఎరువుల సరఫరా, ధరల విషయంలో రైతులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
