Srikalahasti Temple Fire: శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన భక్తులు

Srikalahasti Temple Fire: తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ దక్షిణ గోపురం సమీపంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వంటశాలలో మంటలు ఎగిసిపడటంతో ఆలయంలో ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
ప్రసాదాల వంటశాలలో ఒక్కసారిగా మంటలు
ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో లడ్డూలు, వడలు, అన్నప్రసాదాలు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తొలుత గ్యాస్ లీకేజీ వల్ల మంటలు చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. ఒక సిలిండర్ పేలిందని, పక్కనే ఉన్న ఇతర సిలిండర్లకు కూడా మంటలు వ్యాపించాయని ప్రాథమిక సమాచారం వెలువడింది. అయితే ఆలయ అధికారులు తర్వాత ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని వివరించారు. వంటలు పూర్తయిన తర్వాత మంటలు ఆర్పే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
భయంతో బయటకు పరుగులు తీసిన భక్తులు
వంటశాల నుంచి పెద్ద ఎత్తున మంటలు కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దాలు వినిపించడంతో కొందరు భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. ప్రసాదాలు తయారు చేస్తున్న సిబ్బంది కూడా వెంటనే బయటకు వచ్చారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఆలయ సిబ్బంది తొలుత అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక వాహనం సాయంతో సిబ్బంది మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Rice Bags: 25 కిలోల బియ్యం బస్తాలకు బైబై.. 26 కిలోల ప్యాకెట్ల వెనుక లెక్క ఇదే
భద్రత కోసం విద్యుత్ సరఫరా నిలిపివేత
అగ్నిప్రమాదం నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల మండపాల్లో ఉన్న భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై కూడా తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఆలయ ఈవో వెంకటేశులు, ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
ప్రసాదాల పంపిణీపై అధికారుల వివరణ
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆస్తి నష్టం కూడా ప్రసాదాల వంటశాలకే పరిమితమైందని తెలిపారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ప్రసాదాల తయారీని నిలిపివేసినప్పటికీ, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్వామివారి నైవేద్యం, అన్నప్రసాదాల పంపిణీకి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, సాయంత్రానికి తిరిగి వంటలు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు, నష్టం వివరాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు.

AP DSC 2026: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. 150 స్కూల్ అసిస్టెంట్, 200 ఎస్జీటీ పోస్టులు
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
Vijayasai Reddy New Party: 11-11-11కు ముహూర్తం.. నేడు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన
APPSC Group 1: అభ్యర్థులకు కీలక అలర్ట్.. ఇదే లాస్ట్ ఛాన్స్