గురువారం, నవంబర్ 12, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Rice Bags: 25 కిలోల బియ్యం బస్తాలకు బైబై.. 26 కిలోల ప్యాకెట్ల వెనుక లెక్క ఇదే

Rice Bags

Rice Bags: కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో బియ్యం బస్తాల బరువులో మార్పు కనిపిస్తోంది. గతంలో ఎక్కువగా 25 కిలోల బస్తాలు కనిపించేవి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో 26 కిలోల ప్యాకెట్లే అమ్మకానికి వస్తున్నాయి. బస్తాలో అదనంగా ఒక కిలో బియ్యం ఎందుకు పెంచుతున్నారనే ప్రశ్న వినియోగదారుల్లో మొదలైంది. దీని వెనుక కేవలం ఎక్కువ బియ్యం ఇవ్వాలనే ఆలోచన మాత్రమే లేదని, జీఎస్టీ నిబంధనలు కూడా ఈ మార్పుకు కారణమవుతున్నాయని తెలుస్తోంది.

25 కిలోల వరకు ప్యాక్ చేసిన బియ్యంపై 5 శాతం జీఎస్టీ

2022 జూలై నుంచి ముందుగానే ప్యాక్ చేసి, లేబుల్ వేసిన బియ్యం, గోధుమలు, పప్పులు వంటి కొన్ని ఆహార ధాన్యాలపై 5 శాతం జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే ప్రతి రకమైన బియ్యం అమ్మకంపై ఈ పన్ను వర్తించదు. వస్తువు ముందుగా ప్యాక్ చేసి ఉండటంతో పాటు, ప్యాకేజీపై అవసరమైన వివరాలు ఉండటం వంటి నిబంధనలు కూడా పరిగణనలోకి వస్తాయి. ముఖ్యంగా 25 కిలోలు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉన్న అర్హమైన ప్యాకేజీలకు ఈ పన్ను వర్తిస్తుంది. అందుకే ప్యాకెట్ బరువు విషయంలో వ్యాపారులు నిబంధనలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

26 కిలోల ప్యాకెట్‌తో పన్ను భారం తగ్గుతుందా?

2011 లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనల్లోని మూడో నిబంధన ప్రకారం, 25 కిలోలకు మించిన ప్యాకేజీలకు సాధారణ రిటైల్ ప్యాకేజింగ్ నిబంధనల పరిధిలోని కొన్ని ప్రకటనల నిబంధనలు వర్తించవు. ఈ నిబంధన ఆధారంగా 25 కిలోల కంటే ఎక్కువ బరువున్న ఒకే ప్యాకేజీలో బియ్యం విక్రయిస్తే, అది జీఎస్టీ లెక్కల్లో ప్రీ-ప్యాకేజ్డ్ అండ్ లేబుల్డ్ సరుకుగా పరిగణించకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా 2022లో ఇచ్చిన వివరణలో ఈ అంశాన్ని స్పష్టం చేసింది. 2024లో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి 25 కిలోలకు మించిన ప్యాకేజీలపై జీఎస్టీ పరిధిని మరింత స్పష్టం చేసింది. ఈ వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యాపారులు 25 కిలోల బస్తాల బదులు 26 కిలోల ప్యాకెట్లను ఎంచుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Fertilizers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం

వినియోగదారులకు లాభమా? నష్టమా?

బస్తాలో ఒక కిలో బియ్యం అదనంగా ఉందని మాత్రమే చూసి కొనుగోలు చేయకూడదు. దాని మొత్తం ధరతో పాటు కిలో ధరను కూడా లెక్కించాలి. ఉదాహరణకు, 25 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,250 అనుకుందాం. అప్పుడు కిలో ధర రూ.50 అవుతుంది. అదే కిలో ధరతో 26 కిలోల బస్తా అమ్మితే దాని ధర రూ.1,300 కావాలి. ఒకవేళ 26 కిలోల బస్తాను రూ.1,250కే విక్రయిస్తే కిలో ధర సుమారు రూ.48.08 అవుతుంది. అంటే వినియోగదారుడికి కొంత ఆదా అవుతుంది. అయితే 26 కిలోల బస్తా ధరను ఎక్కువగా నిర్ణయిస్తే ఆ ప్రయోజనం ఉండకపోవచ్చు.

బియ్యం కొనేముందు ఇది గమనించండి

26 కిలోల ప్యాకెట్ కనిపించిందని దానికి ఆటోమేటిక్‌గా జీఎస్టీ మినహాయింపు వచ్చిందని భావించకూడదు. ప్యాకేజీ నిజంగా 25 కిలోలకు మించి ఒకే ప్యాకెట్‌గా ఉందా? అందులోని వస్తువు, విక్రయ విధానం జీఎస్టీ నిబంధనలకు సరిపోతున్నాయా? వంటి అంశాల ఆధారంగా పన్ను బాధ్యత నిర్ణయమవుతుంది. అందుకే కొనుగోలు సమయంలో బస్తాపై ఉన్న నికర బరువు, గరిష్ఠ చిల్లర ధర, కిలోకు పడుతున్న ధరను పరిశీలించాలి. బియ్యం నాణ్యత, రకం కూడా పోల్చుకోవాలి. అప్పుడే 25 కిలోల బస్తా మంచిదా, 26 కిలోల ప్యాకెట్ మంచిదా అనేది నిర్ణయించుకోవచ్చు.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. వార్తల్లోని ముఖ్యమైన అంశాలను గుర్తించి, పాఠకులకు సులభంగా అర్థమయ్యే భాషలో, ఆసక్తికరమైన శైలిలో అందించడం ఆయన ప్రత్యేకత. తాజా పరిణామాలను వేగంగా గుర్తించడం, సమాచారాన్ని విశ్లేషించడం, వాస్తవాలను పరిశీలించి కథనాలుగా మలచడంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది.