శనివారం, నవంబర్ 14, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Ration Card: రేషన్ కార్డుల స్థానంలో ఈ-రూపీ డిజిటల్ వోచర్లు.. కేంద్రం కొత్త ప్రతిపాదన ఇదే

Ration Card

Ration Card: దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. సాధారణ రేషన్ కార్డుల స్థానంలో ఈ-రూపీ డిజిటల్ వోచర్ల విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ డిజిటల్ రూపీ ఆధారిత ఆహార సబ్సిడీ పైలట్ ప్రాజెక్టును పరిశీలిస్తుండగా, త్వరలోనే ఫోన్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా సరుకులు పొందే విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఉచిత రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో ఈ-రూపీ డిజిటల్ వోచర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ఆర్బీఐ ప్రవేశపెట్టిన డిజిటల్ రూపీ ఆధారిత ఫుడ్ సబ్సిడీ పైలట్ ప్రాజెక్టు పరిశీలనలో ఉందని, ఇది త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

వోచర్ ఎలా పనిచేస్తుందంటే

ఈ-రూపీ అనేది నిర్దిష్ట ప్రయోజనం కోసం మాత్రమే జారీ చేసే ఒక డిజిటల్ వోచర్. ఉదాహరణకు ఒక కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం కేటాయింపు ఉంటే, ఆ పరిమాణానికి సరిపడా స్పెషల్ వోచర్ జనరేట్ అవుతుంది. దీనిపై నగదు విలువ ఉండదు, కేవలం ఆహార ధాన్యాల వివరాలు మాత్రమే ఉంటాయి. దీనిని ఏటీఎం ద్వారా నగదుగా మార్చుకోవడం గానీ, వేరొకరికి బదిలీ చేయడం గానీ కుదరదు. లబ్ధిదారుల అర్హత వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపుతారు. ఎస్బీఐ, ఎన్పీసీఐ ఈ-రూపీ వేదికతో కలిసి ఆధార్‌తో అనుసంధానమైన లబ్ధిదారుడికి ప్రత్యేక వోచర్‌ను రూపొందిస్తుంది. ఇది లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ లేదా క్యూఆర్ కోడ్ రూపంలో చేరుతుంది. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు మేరా రేషన్ యాప్ ద్వారా కూడా దీనిని పొందవచ్చు. స్థానిక రేషన్ దుకాణానికి వెళ్లి ఈ క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ చూపిస్తే, డీలర్ ఈపీఓఎస్ యంత్రంతో స్కాన్ చేస్తారు. అనంతరం ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఆధార్ ధృవీకరణ పూర్తయ్యాక సరుకులు అందిస్తారు.


ఇది కూడా చదవండి: Mahesh Babu: మహేశ్ బాబు ఇంట్లో పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు

ప్రస్తుతం దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సుమారు 5.51 లక్షల రేషన్ దుకాణాల ద్వారా 78.65 కోట్ల మందికి సరుకులు అందుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి కేంద్రం రూ.2,27,429 కోట్లకు పైగా కేటాయించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 2029 వరకు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలో పారదర్శకత కోసం జనవరి 2026లో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక కాన్సెప్ట్ నోట్ విడుదల చేసింది. ఇందులో ఎస్బీఐని ఇష్యూయర్ బ్యాంక్‌గా, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌ను సాంకేతిక భాగస్వామిగా సూచించింది.

ఎందుకు ముఖ్యమంటే

ఇప్పటికే ఆధార్ ధృవీకరణ, ఈపీఓఎస్ యంత్రాలు, వన్ నేషన్-వన్ రేషన్ కార్డు వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. వీటికి తోడు ఈ-రూపీ వోచర్ విధానం వస్తే సరుకులు పక్కదారి పట్టకుండా పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చు. పంపిణీ పూర్తయిన వెంటనే లావాదేవీల వివరాలు డిజిటల్ వ్యవస్థలో నమోదై, బ్యాంకుల మధ్య సెటిల్‌మెంట్ జరగడంతో పాటు డీలర్ కమిషన్ వివరాలు కూడా పారదర్శకంగా రికార్డు అవుతాయి. లబ్ధిదారుడు స్వయంగా రీడీమ్ చేసుకునేలా రూపొందిస్తున్న ఈ డిజిటల్ వోచర్ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, దేశవ్యాప్త రేషన్ పంపిణీ ప్రక్రియ మరింత కట్టుదిట్టంగా మారనుంది.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. వార్తల్లోని ముఖ్యమైన అంశాలను గుర్తించి, పాఠకులకు సులభంగా అర్థమయ్యే భాషలో, ఆసక్తికరమైన శైలిలో అందించడం ఆయన ప్రత్యేకత. తాజా పరిణామాలను వేగంగా గుర్తించడం, సమాచారాన్ని విశ్లేషించడం, వాస్తవాలను పరిశీలించి కథనాలుగా మలచడంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది.