Kangana Ranaut: సోషల్ మీడియా పోస్టులతో చిక్కుల్లో కంగనా రనౌత్.. క్రిమినల్ కేసు నమోదు

Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. గాంధీ కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆమెపై శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షిమ్లా నివాసి కెప్టెన్ అతుల్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సిమ్లా పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ సింగ్ వెల్లడించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 196 (వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్ 353, సెక్షన్ 356 (పరువు నష్టం) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరణాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
నవంబర్ 10న కంగనా రనౌత్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టులపై అతుల్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పాటు ఆమె కుమారులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ మరణాలకు సంబంధించి కంగనా అత్యంత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గురువారం రాత్రి 7 గంటల 51 నిమిషాలకు రాష్ట్ర డీజీపీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు. కంగనాపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు, నిర్ణీత గడువులోగా సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరిపించాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.
ఇది కూడా చదవండి: Weather Update: తెలంగాణలో చలి పంజా.. ఏపీకి వర్ష సూచన.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సోనియా, మేనకా గాంధీలపై సంచలన పోస్టులు
కంగనా పెట్టిన పోస్టుల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఒక రహస్య విదేశీ పౌరురాలిగా చిత్రీకరించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. తన బంధువులు ఒక్కొక్కరుగా హత్యకు గురవుతున్న సమయంలో ఆమె విదేశాల్లోని ఒక కేఫ్‌లో ఉన్నారని, ఆ తర్వాత ప్రభుత్వ అధినేతగా మారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారంటూ కంగనా పోస్టులో రాసుకొచ్చినట్లు అతుల్ శర్మ వివరించారు. అంతేకాకుండా, సంజయ్ గాంధీ మరణం తర్వాత మేనకా గాంధీని అకస్మాత్తుగా కుటుంబ నివాసం నుంచి బయటకు పంపించేశారని ఆ పోస్టులో ఆరోపించినట్లు తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్ర
ఇలాంటి నిరాధారమైన, తప్పుడు కథనాలను ప్రచారం చేయడం ద్వారా సమాజంలో ప్రజల మధ్య ద్వేషాన్ని రగిలించే ప్రమాదం ఉందని అతుల్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలనే ఉద్దేశంతోనే కంగనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని ఆయన మండిపడ్డారు. ఈ పోస్టులు వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను పెంచి ప్రజాశాంతికి భంగం కలిగిస్తాయని, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఇందులో ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో సైబర్ ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Ration Card: రేషన్ కార్డుల స్థానంలో ఈ-రూపీ డిజిటల్ వోచర్లు.. కేంద్రం కొత్త ప్రతిపాదన ఇదే
Fertilizers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం