Aaryavir Sehwag: పాక్‌తో ఫైనల్.. 14 ఏళ్ల రికార్డుపై కన్నేసిన సెహ్వాగ్ కొడుకు

Aaryavir Sehwag: అండర్-19 ఆసియా కప్ 2026లో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈరోజు (నవంబర్ 14) జరగనున్న ఫైనల్లో టీమిండియా గెలిచి తొమ్మిదోసారి ట్రోఫీని అందుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు గ్రూప్ దశలో భారత్‌ను ఓడించిన పాకిస్థాన్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి యువ బ్యాటర్ ఆర్యవీర్ సెహ్వాగ్‌పై నిలిచింది. భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడైన ఆర్యవీర్ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.
68 పరుగులు చేస్తే చరిత్రే
ఒక అండర్-19 ఆసియా కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశం ఆర్యవీర్‌కు ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ పేరిట ఉంది. 2012 అండర్-19 ఆసియా కప్‌లో ఉన్ముక్త్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 370 పరుగులు చేశాడు. అప్పటి నుంచి ఈ రికార్డు 14 ఏళ్లుగా చెక్కుచెదరలేదు. ప్రస్తుత టోర్నీలో ఆర్యవీర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 303 పరుగులు సాధించాడు. ఉన్ముక్త్ రికార్డును అధిగమించాలంటే ఫైనల్లో అతడు మరో 68 పరుగులు చేయాలి. అలా చేస్తే ఒకే అండర్-19 ఆసియా కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
అద్భుత ఫామ్‌లో ఆర్యవీర్
ఈ టోర్నీలో ఆర్యవీర్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతోంది. ఇప్పటివరకు ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 303 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే పాకిస్థాన్‌తో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో మాత్రం అతడు 22 పరుగులకే పరిమితమయ్యాడు. ఇప్పుడు అదే ప్రత్యర్థితో ఫైనల్ ఆడే అవకాశం రావడంతో తన బ్యాటింగ్‌తో సమాధానం చెప్పాలని ఆర్యవీర్ భావిస్తున్నాడు. వ్యక్తిగత రికార్డుతో పాటు జట్టుకు టైటిల్ అందించడంపైనా అతడి దృష్టి ఉండనుంది.
పాక్‌ను ఓడించడం భారత్‌కు సవాలే
ఈ ఫైనల్లో భారత్‌కు పాకిస్థాన్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. టోర్నీలో ఇప్పటివరకు పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. గ్రూప్ దశలో భారత్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి తన బలాన్ని చూపించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 208 పరుగులకు ఆలౌట్ కాగా, పాకిస్థాన్ 48.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన భారత్ ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు వచ్చింది. కెప్టెన్ లక్ష్య రాజ్చందాని నేతృత్వంలోని భారత జట్టు ఈసారి పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
ఇది కూడా చదవండి: Mobile Recharge: మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు.. నెలకు రూ.350 ఖర్చు చేయాల్సిందేనట
తొమ్మిదో టైటిల్‌పై టీమిండియా గురి
అండర్-19 ఆసియా కప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది. ఈసారి గెలిస్తే తొమ్మిదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. అయితే గత మూడు ఎడిషన్లలో భారత్‌కు టైటిల్ దక్కలేదు. దీంతో ఈసారి కప్పు గెలవడం జట్టుకు మరింత కీలకంగా మారింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్ ఈ పోరుకు వేదిక. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం, సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఆర్యవీర్ 68 పరుగులు సాధించి 14 ఏళ్ల రికార్డును బద్దలు కొడతాడా? భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్‌ను అందుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

IND vs NZ: రోహిత్, కోహ్లీ, శ్రేయస్.. తొలి ఓవర్లోనే ముగ్గురూ డకౌట్.. భారత్ ఖాతాలో చెత్త రికార్డు
U19 Asia Cup: సెమీస్‌కు భారత్, పాకిస్థాన్.. ఫైనల్లో దాయాదుల పోరు ఉంటుందా?
IND vs NZ: నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. గిల్, రాహుల్ స్థానాల్లో ఎవరంటే?