శనివారం, నవంబర్ 14, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Mobile Recharge: మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు.. నెలకు రూ.350 ఖర్చు చేయాల్సిందేనట

Telecom Tariff Hike

Mobile Recharge: మొబైల్ రీఛార్జ్ ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సామాన్యులకు త్వరలోనే మరో భారమైన వార్త వినాల్సి రావచ్చు. భారతీ ఎంటర్‌ప్రైజెస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొబైల్ సేవల ఛార్జీలు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజలు చిప్స్ ప్యాకెట్లు, సబ్బులు, పెప్సీ బాటిళ్ల వంటి వాటిపై ఆలోచించకుండా డబ్బులు ఖర్చు పెడతారని, కానీ అత్యవసరమైన మొబైల్ సేవల కోసం మాత్రం తక్కువ ఖర్చు చేయాలని చూస్తారని ఆయన పోల్చి చెప్పారు.

రోజుకు రూ.10-12లు ఎక్కువ కాదు

నేటి రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడటానికి మాత్రమే పరిమితం కాలేదని మిట్టల్ గుర్తు చేశారు. బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు, ఆన్‌లైన్ చదువులు, ప్రభుత్వ పథకాల నగదు బదిలీ వంటి ముఖ్యమైన పనులన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. వీటికి తోడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వినోద వేదికలను కూడా నిరంతరం వాడుతున్నారు. ఇన్ని సేవలు పొందుతున్నప్పుడు రోజుకు 10 నుంచి 12 రూపాయలు అంటే నెలకు సగటున రూ.350లు ఖర్చు చేయడంలో తప్పేమీ లేదని ఆయన తన వాదనను వినిపించారు.

రూ.300 నుంచి రూ.350కి పెరిగిన లక్ష్యం

గతంలో ప్రతి వినియోగదారుడి నుంచి నెలకు సగటున 300 రూపాయల ఆదాయం (ఏఆర్‌పీయూ) రావాలని మిట్టల్ పలుమార్లు చెప్పారు. అయితే ఆ 300 రూపాయల అంచనా దాదాపు పదేళ్ల నాటిదని, అప్పటి నుంచి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని ఆయన వివరించారు. విద్యుత్ ఛార్జీలు, ఇంధన ధరలు, ఉద్యోగుల జీతాలు, నెట్‌వర్క్ నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం వల్ల టెలికాం సంస్థలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో సంస్థలు మనుగడ సాగించాలంటే సగటు నెలవారీ ఆదాయం 350 రూపాయలకు చేరడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Kangana Ranaut: సోషల్ మీడియా పోస్టులతో చిక్కుల్లో కంగనా రనౌత్.. క్రిమినల్ కేసు నమోదు

చైనాతో పోలిస్తే భారత్‌లో టవర్లు తక్కువ

భారత్, చైనా దేశాల టెలికాం మౌలిక సదుపాయాలను కూడా మిట్టల్ పోల్చి చూపారు. చైనాలో 10 లక్షలకు పైగా మొబైల్ టవర్లు ఉండగా, భారత్‌లో కేవలం 3.5 లక్షల టవర్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మెరుగైన సేవల కోసం దేశంలో టవర్ల సంఖ్యను కనీసం రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనితో పాటు ఫైబర్ నెట్‌వర్క్, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉందని చెప్పారు. 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలుకు లక్షల కోట్లు, నెట్‌వర్క్ నిర్మాణానికి దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ధరల పెంపు ఎప్పుడు ఉండొచ్చు?

రీఛార్జ్ ప్లాన్ల ధరలు కచ్చితంగా ఎప్పుడు పెరుగుతాయనే తేదీని మిట్టల్ వెల్లడించలేదు. టెలికాం రంగం ఎప్పటికి 350 రూపాయల స్థాయికి చేరుకుంటుందో ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. చివరిసారిగా జూన్ 2024లో టెలికాం కంపెనీలు టారిఫ్‌లను 10 నుంచి 25 శాతం వరకు పెంచాయి. గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 256 రూపాయలుగా ఉన్న ఎయిర్‌టెల్ సగటు ఆదాయం, ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 271 రూపాయలకు చేరింది. 350 రూపాయల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుత ధరల్లో దాదాపు 29 శాతం పెరుగుదల అవసరమని, దేశంలో మూడు బలమైన ప్రైవేట్ టెలికాం సంస్థలు కొనసాగడం చాలా ముఖ్యమని మిట్టల్ అభిప్రాయపడ్డారు.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. వార్తల్లోని ముఖ్యమైన అంశాలను గుర్తించి, పాఠకులకు సులభంగా అర్థమయ్యే భాషలో, ఆసక్తికరమైన శైలిలో అందించడం ఆయన ప్రత్యేకత. తాజా పరిణామాలను వేగంగా గుర్తించడం, సమాచారాన్ని విశ్లేషించడం, వాస్తవాలను పరిశీలించి కథనాలుగా మలచడంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది.