Tirumala: శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్.. జస్ట్ రూ.5తో కుటుంబమంతటికీ శ్రీవారి దర్శన భాగ్యం

Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబర్ 20 నుంచి సద్గమయ పేరుతో ప్రత్యేక ఆన్‌లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం టీటీడీ ఇప్పటికే ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో చేరాలనుకునే భక్తులు ఆన్‌లైన్ పోర్టల్‌లో నామమాత్రంగా కేవలం 5 రూపాయలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఐదు భాషల్లో ఇతిహాసాల సారాంశం
సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్య భక్తులకు సైతం సులభంగా అర్థమయ్యేలా చేరువ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి మహోన్నత గ్రంథాల్లోని ముఖ్యమైన అంశాలను సరళమైన రీతిలో రోజూ ఆన్‌లైన్ ద్వారా భక్తులకు అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌకర్యార్థం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, ఆంగ్ల భాషల్లో ఈ పాఠాలను అందుబాటులో ఉంచుతున్నారు.
ఇది కూడా చదవండి: Aaryavir Sehwag: పాక్‌తో ఫైనల్.. 14 ఏళ్ల రికార్డుపై కన్నేసిన సెహ్వాగ్ కొడుకు
క్విజ్ పోటీల్లో గెలిస్తే శ్రీవారి దర్శనం
మొదటి విడతగా శ్రీవారి సేవకుల ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి, ఆ తర్వాత దేశ విదేశాల్లోని భక్తులందరికీ విస్తరించాలని టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేవలం పాఠాలు అందించడమే కాకుండా, వాటిపై భక్తులకు ఎంతవరకు అవగాహన కలిగిందో తెలుసుకునేందుకు రోజూ ఆన్‌లైన్‌లో క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ పోటీల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి నుంచి లక్కీడిప్ పద్ధతిలో ఆరుగురిని ఎంపిక చేస్తారు. విజేతలుగా నిలిచిన వారికి తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునే అద్భుత అవకాశాన్ని టీటీడీ కల్పించనుంది.
పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి అభయం
మరోవైపు, నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి తిరుమలలో స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్పరాజైన పెద్ద శేష వాహనంపై అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా స్వామివారికి నిత్యం సేవలందించే ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు.

Horoscope Today: నేటి రాశి ఫలాలు (నవంబర్ 14, 2026).. ఈ రోజు మీకు ఎలా ఉండబోతోందంటే