శనివారం, నవంబర్ 14, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

APPSC Jobs: ఇంజనీరింగ్ అభ్యర్థులకు 503 ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 22 చివరి తేదీ

APPSC Jobs

APPSC Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 503 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు నవంబర్ 22, 2026 రాత్రి 11.59 గంటల వరకు గడువు ఉంది.

ఏ విభాగంలో ఎన్ని పోస్టులు?

ఈ నియామకాల్లో పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో 21 పోస్టులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 100 పోస్టులు ఉన్నాయి. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో 73, రోడ్లు భవనాల శాఖలో సివిల్ విభాగానికి 75, ఎలక్ట్రికల్ విభాగానికి 4 పోస్టులు కేటాయించారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. జలవనరుల శాఖలో సివిల్ విభాగానికి 203, మెకానికల్ విభాగానికి 21 పోస్టులు ఉన్నాయి. ఇలా మొత్తం 503 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు, వయోపరిమితి ఇవే

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అర్హతలు పోస్టును బట్టి మారుతాయి. కొన్ని పోస్టులకు AMIE పరీక్షలో సెక్షన్ A, B ఉత్తీర్ణత సాధించినవారికి కూడా అవకాశం ఉంది. అభ్యర్థుల వయసు 2026 జూలై 1 నాటికి కనీసం 18, గరిష్టంగా 44 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది. ఇతర ప్రత్యేక వర్గాలకు నిబంధనల ప్రకారం మినహాయింపులు వర్తిస్తాయి.

ఇది కూడా చదవండి: Tirumala: శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్.. జస్ట్ రూ.5తో కుటుంబమంతటికీ శ్రీవారి దర్శన భాగ్యం

జీతం ఎంత? ఎంపిక ఎలా చేస్తారు?

ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు పే స్కేల్ ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీతో పాటు సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టులపై ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశలో కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)లో కూడా అర్హత సాధించాలి. పరీక్ష తేదీని APPSC తర్వాత ప్రకటిస్తుంది.

దరఖాస్తు ఫీజు, చివరి తేదీ వివరాలు

అభ్యర్థులు ముందుగా APPSC అధికారిక వెబ్‌సైట్‌లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత తమ OTPR వివరాలతో లాగిన్ అయి AEE నోటిఫికేషన్‌కు దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఏపీ ప్రభుత్వ వైట్ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు, నిబంధనల ప్రకారం అర్హులైన నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆసక్తి, అర్హత ఉన్నవారు నవంబర్ 22, 2026 రాత్రి 11.59 గంటల్లోగా దరఖాస్తు పూర్తి చేయాలి. పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కోసం APPSC అధికారిక వెబ్‌సైట్ను సందర్శించాలి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.