Indian Railways: రైల్వే స్టేషన్లలో తాగునీరు, టాయిలెట్ల పరిస్థితిపై సుప్రీంకోర్టు సీరియస్

Indian Railways: రైలు ప్రయాణం అంటే చాలామందికి రోజువారీ అవసరం. కానీ స్టేషన్‌కు వెళ్లినప్పుడు తాగునీరు, కూర్చోవడానికి సీట్లు, శుభ్రమైన మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోతే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిందే. దేశంలోని రైల్వే స్టేషన్లలో ఇలాంటి సమస్యలు ఉన్నట్లు కాగ్ (CAG) నివేదిక బయటపెట్టింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. రైల్వే స్టేషన్లలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రైల్వే మంత్రిత్వ శాఖకు సూచించింది. కాగ్ నివేదికలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను పరిష్కరించింది.
512 స్టేషన్లలో 458 చోట్ల లోపాలు
దేశవ్యాప్తంగా 512 రైల్వే స్టేషన్లలో కాగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వీటిలో 458 స్టేషన్లలో కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని గుర్తించారు. అంటే తనిఖీ చేసిన స్టేషన్లలో 89 శాతానికి పైగా చోట్ల ఏదో ఒక లోపం ఉన్నట్లు తేలింది. ప్రయాణికులకు తాగునీరు, కూర్చునే సీట్లు, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫామ్‌పై షెల్టర్లు, ఫ్యాన్లు, వాటర్ కూలర్లు, దారి చూపించే బోర్డుల విషయంలో ఈ సమస్యలు కనిపించాయి. అన్ని కనీస ప్రమాణాలు అందుబాటులో ఉన్నవి కేవలం 54 స్టేషన్లలోనే. అంటే మొత్తం తనిఖీ చేసిన వాటిలో దాదాపు 11 శాతం స్టేషన్లే అన్ని నిబంధనలను పాటించాయి.
తాగునీటిలో ఈ.కోలి బ్యాక్టీరియా
కేవలం సౌకర్యాల కొరతే కాదు.. ప్రయాణికులకు అందించే తాగునీటి నాణ్యతపైనా కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని స్టేషన్లలో వాటర్ కూలర్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో ఈ.కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో బయటపడింది. హైదరాబాద్‌తో పాటు కోయంబత్తూరు, పాలక్కాడ్ జంక్షన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, భివాండి రోడ్, కళ్యాణ్, లోణావళా, మధుపూర్ స్టేషన్లలో ఈ సమస్యను గుర్తించారు. అంతేకాదు, కొన్ని చోట్ల తాగునీటికి అవసరమైన రసాయన పరీక్షలు నిర్ణీత సమయానికి నిర్వహించలేదని నివేదిక పేర్కొంది. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణలోనూ లోపాలు ఉన్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: డీప్‌ఫేక్‌లపై చిరంజీవి పోరాటం.. కేంద్రానికి వినతిపత్రం
ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతపై ఆందోళన
ఈ సమస్యలతో ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత, గౌరవానికి ముప్పు ఏర్పడుతోందని పిటిషనర్ కృష్ణకాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టేషన్లలో తాగునీటి వనరులను క్రమం తప్పకుండా పరీక్షించాలని, నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, రసాయనాలు ఉన్నాయా లేదా గుర్తించాలని కోరారు. శుభ్రమైన మరుగుదొడ్లు, చెత్త నిర్వహణ, అత్యవసర వైద్య సదుపాయాలు, దివ్యాంగులకు అవసరమైన వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సౌకర్యాలు కేవలం రికార్డుల్లో కాకుండా క్షేత్రస్థాయిలోనూ అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని కోరారు.
కాగ్ సూచనలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని రైల్వే మంత్రిత్వ శాఖకు సూచించింది. కాగ్ తన ఆడిట్ నివేదికలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సదుపాయాలు, ప్లాట్‌ఫామ్ షెల్టర్లు వంటి వసతుల కల్పనతో పాటు వాటి నిర్వహణ కూడా కీలకం కానుంది. కాగ్ నివేదిక ప్రకారం ఈ తనిఖీలు 16 రైల్వే జోన్ల పరిధిలోని నాన్-సబర్బన్ స్టేషన్లలో జరిగాయి. 2019-20 నుంచి 2023-24 మధ్య పరిస్థితులను కూడా ఆడిట్ పరిశీలించింది.

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం విజయ్ సర్కార్ పడిపోతుందా?
Kangana Ranaut: సోషల్ మీడియా పోస్టులతో చిక్కుల్లో కంగనా రనౌత్.. క్రిమినల్ కేసు నమోదు
Ration Card: రేషన్ కార్డుల స్థానంలో ఈ-రూపీ డిజిటల్ వోచర్లు.. కేంద్రం కొత్త ప్రతిపాదన ఇదే
Fertilizers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం