Telangana Govt: తెలంగాణలో 7 లక్షల కుటుంబాలకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్

Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు సహా వివిధ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెద్ద ఊరట కల్పించింది. ఇంటి నిర్మాణ రుణాల కోసం ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టిన ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి లబ్ధిదారులకే అప్పగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
తహసీల్దార్ కార్యాలయాల్లోనే మగ్గిపోయిన పత్రాలు
2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైన గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్ల నిర్మాణానికి మూడు విధాలుగా నిధులు సమకూర్చేవారు. ప్రభుత్వ రాయితీ, లబ్ధిదారుడి సొంత వాటాతో పాటు బ్యాంకు రుణం ద్వారా ఆర్థిక సహాయం అందేది. ఆ బ్యాంకు రుణాలకు పూచీకత్తుగా లబ్ధిదారులు తమ ఇళ్ల అసలు పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను ప్రభుత్వం వద్ద తనఖా పెట్టాల్సి వచ్చేది. నిబంధనల ప్రకారం రుణం తీరిపోయిన తర్వాత ఆ పత్రాలను తిరిగి ఇచ్చేయాలి. కానీ శాఖల మధ్య సమన్వయ లోపం, సాంకేతిక కారణాల వల్ల అవి దశాబ్ద కాలంగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఉండిపోయాయి.
సొంతింటిపై పూర్తి యాజమాన్య హక్కులు
ఒరిజినల్ పట్టాలు చేతిలో లేకపోవడంతో లక్షలాది మంది లబ్ధిదారులు తమ సొంతిళ్లపై పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను పొందలేకపోయారు. అత్యవసర ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి కూడా వీలు లేక ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రస్తుత ప్రభుత్వం, ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఆ పత్రాలను లబ్ధిదారులకు తిరిగి ఇచ్చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పట్టాల వాపసు ప్రక్రియ పూర్తయితే ఆస్తులపై పూర్తి హక్కులు లభించడంతో పాటు అవసరమైనప్పుడు బ్యాంకు లోన్లు పొందే అవకాశం కలుగుతుంది.
గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు
పట్టాల పంపిణీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామ స్థాయిలోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అసలు పట్టాలు, సర్టిఫికెట్లను అందజేయనున్నారు. ఏళ్ల తరబడి తమ ఇళ్ల పత్రాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ తాజా నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. ఖాళీ రైలులో చెలరేగిన మంటలు
Gig Workers: గిగ్ వర్కర్లకు సర్కార్ గుడ్ న్యూస్.. రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్
Rythu Bharosa: యాసంగి రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసాపై త్వరలోనే కీలక ప్రకటన?