మంగళవారం, నవంబర్ 17, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం విజయ్ సర్కార్ పడిపోతుందా?

CM Vijay

CM Vijay: దక్షిణాది రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా తమిళనాడులో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తమిళ వెట్రీ కజగం (TVK) అధినేత, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ప్రభుత్వంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో త్వరలోనే డీఎంకే(DMK) ప్రభుత్వం మళ్లీ రాబోతోందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం విజయ్ సైతం తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశం కావడంతో తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.

సీఎం విజయ్ ఎమర్జెన్సీ మీటింగ్

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సీఎం విజయ్ ఇటీవల తన పార్టీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా సమావేశమైనట్లు నివేదికలు వెలువడ్డాయి. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో కొద్దిమంది ఎమ్మెల్యేలతో విజయ్ వ్యక్తిగతంగా మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలు ఢిల్లీ పెద్దల సాయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయనే పక్కా సమాచారం ఉందని ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసినట్లు సమాచారం. తమ రాజకీయ జీవితానికి ముప్పు తెచ్చే ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీకి నష్టం కలిగించే పనులకు దూరంగా ఉండాలని విజయ్ గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Telangana Govt: తెలంగాణలో 7 లక్షల కుటుంబాలకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్

స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తనను ఇంకా అభిమానులు ముఖ్యమంత్రి అని పిలవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత టీవీకే పాలన సరిగా లేదని, ప్రజలు విసిగిపోతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనే ఈ ప్రభుత్వం ఆరు నెలలు కూడా పూర్తి స్థాయిలో సాగదని తాను చెప్పానని, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే నిజం కానుందని స్టాలిన్ పరోక్షంగా హెచ్చరించారు. త్వరలోనే అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ లేదా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఢిల్లీ పర్యటనలో సీఎం విజయ్

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్యే సీఎం విజయ్ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజధాని ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీకి కాస్త దూరంగా నిలిచిన టీవీకే పార్టీకి కాంగ్రెస్, వామపక్షాలు బయటి నుంచి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితులలో మిత్రపక్షాల మద్దతును కాపాడుకోవడం, పార్టీ ఎమ్మెల్యేలను చేజారిపోకుండా చూసుకోవడం విజయ్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు ఎలాంటి సంచలన మలుపులు తిరుగుతాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.