బుధవారం, నవంబర్ 18, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

AP Govt Scheme: ఏపీలో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.231 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt Scheme

AP Auto Driver Sevalo Scheme 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. స్వయంగా వాహనాలు నడుపుతూ జీవనం సాగించే అర్హులైన డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు మరోసారి చర్యలు చేపట్టింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.231.13 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ జీఓ ఆర్టీ నంబర్ 142 జారీ చేసింది. ఈ పథకం కింద అర్హులైన ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15,000 చొప్పున అందించనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే డ్రైవర్లలో ఆశలు చిగురించాయి.

ఆటో డ్రైవర్ల సేవలో పథకం

ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం 2025లో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించింది. సొంతంగా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండి, వాటిని స్వయంగా నడుపుతూ జీవనం సాగించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. గతంలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద రూ.10 వేల సాయం అందించేవారు. ప్రస్తుత పథకంలో ఆ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచారు. వాహనాల బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాలకు ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు.

తొలి ఏడాది ఎంతమందికి లబ్ధి కలిగిందంటే?

ఈ పథకం ప్రారంభమైన తొలి ఏడాదిలోనే సుమారు 2.90 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మొత్తం రూ.436 కోట్ల వరకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇందులో 2.64 లక్షల మంది ఆటో డ్రైవర్లు, 20,072 మంది మోటార్ క్యాబ్ డ్రైవర్లు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఆదాయంపై ప్రభావం పడిందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కొనసాగిస్తోంది.

ఇది కూడా చదవండి: Weather Update: మునుపెన్నడూ లేని విధంగా తుఫాను ముప్పు.. ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్

ఈ పథకానికి ఎవరు అర్హులు?

ఈ పథకం ద్వారా సాయం పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి.

- దరఖాస్తుదారుడికి సొంతంగా ఆటో, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ ఉండాలి.

- వాహనాన్ని యజమాని స్వయంగా నడుపుతూ జీవనం సాగించాలి.

- ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

- వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ఉండాలి.

- ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

అద్దె వాహనాలు నడిపేవారు, వేరే డ్రైవర్లతో తమ వాహనాలను నడిపించేవారు ఈ పథకానికి అర్హులు కాకపోవచ్చు. అలాగే ఈ విడతకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్న లబ్ధిదారుల అర్హతలను కూడా పరిశీలించాలి.

డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి?

తాజాగా ప్రభుత్వం రూ.231.13 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అయితే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు జమ చేసే కచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించినట్లు సమాచారం లేదు. కాబట్టి డబ్బులు వెంటనే పడతాయని భావించకుండా అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో గ్రామ, వార్డు సచివాలయంలో తెలుసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్సీ, ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవాలి. బ్యాంకు ఖాతా పనిచేస్తోందో లేదో కూడా పరిశీలించుకోవడం మంచిది. జాబితాలో పేరు లేకపోతే సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.