బుధవారం, నవంబర్ 18, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Cyclone Akvan: బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Cyclone Akvan

Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను క్రమంగా బలపడుతోంది. నవంబర్ 18 తెల్లవారుజామున భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఈ తుఫాను మధ్య బంగాళాఖాతంలో గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. చెన్నైకి తూర్పున 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 620 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 18 ఉదయానికి తీవ్ర తుఫానుగా, 19వ తేదీ సాయంత్రానికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

నవంబర్ 20న తీరం దాటే అవకాశం

అక్వాన్ తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్‌-యానాం తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ తాజా బులెటిన్‌లో పేర్కొంది. ఆ సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చు. గాలుల వేగం అప్పుడప్పుడు 145 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించింది. తుఫాను తీరం దాటే సమయానికి సముద్రం మరింత అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.

19, 20 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 18న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడవచ్చని హెచ్చరించింది. రాయలసీమలో నవంబర్ 19, 20 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి.

ఇది కూడా చదవండి: CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం విజయ్ సర్కార్ పడిపోతుందా?

ఈ జిల్లాలకు ముప్పు.. సముద్రంలో అలజడి

తుఫాను తీరం దాటే సమయంలో ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సముద్రపు నీరు తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో అలల ప్రభావంతో నీరు చేరే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. మత్స్యకారులు నవంబర్ 21 వరకు పలు సముద్ర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు, బలమైన గాలుల కారణంగా చెట్లు విరిగిపడటం, విద్యుత్ సరఫరాకు అంతరాయం, రహదారులపై నీరు నిలవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

తెలంగాణకూ వర్ష సూచన

అక్వాన్ తుఫాను ప్రభావం తెలంగాణపైనా ఉండనుంది. నవంబర్ 20, 21 తేదీల్లో తూర్పు తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కోస్తాంధ్రలోని తీర ప్రాంత ప్రజలు సముద్రం దగ్గరకు వెళ్లకూడదు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు. రైతులు కోతకు వచ్చిన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ గాలుల సమయంలో చెట్ల కింద, బలహీనమైన ఇళ్లలో ఉండకూడదు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించాలి. తుఫాను కదలికలు, వర్షాలపై తాజా సమాచారం కోసం భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటనలను గమనించాలి.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.