EPFO: పెన్షన్ తీసుకునేవారికి కీలక అలర్ట్.. ఇంట్లోనే ఇలా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించండి

EPFO Pension Update 2026: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) పరిధిలోని ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా నెలనెలా పెన్షన్ పొందుతున్నవారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. పెన్షన్ కొనసాగాలంటే ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికేట్ (జీవిత ధృవీకరణ పత్రం) సమర్పించాలి. పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి జీవించి ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఈ పత్రం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రత్యేక ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈపీఎస్ పెన్షనర్లు తమ సర్టిఫికేట్ గడువు ముగిసే తేదీని తప్పనిసరిగా పరిశీలించాలి.
లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు సమర్పించాలి?
సాధారణంగా ఈపీఎస్ నిబంధనల ప్రకారం 58 ఏళ్లు పూర్తయిన తర్వాత అర్హత ఉన్న ఉద్యోగులు నెలవారీ పెన్షన్ పొందుతారు. ఈ పెన్షన్ నిరంతరాయంగా అందాలంటే జీవిత ధృవీకరణ పత్రం అవసరం. గతంలో ప్రతి ఏడాది నవంబర్‌లోనే ఈ పత్రాన్ని సమర్పించాల్సి వచ్చేది. అయితే ఈపీఎఫ్‌ఓ 2020లో తీసుకొచ్చిన మార్పు ప్రకారం ఈపీఎస్ పెన్షనర్లు ఏడాదిలో తమకు అనుకూలమైన సమయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. సమర్పించిన తేదీ నుంచి అది ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసిన తర్వాత కొత్త సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడవచ్చు.
మొబైల్‌లోనే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం
పెన్షనర్లు ఈ పని కోసం ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్ ఉపయోగించి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు విధానంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇందుకోసం ఆధార్ నంబర్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్, పెన్షన్ ఖాతా వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఫోన్‌లో AadhaarFaceRD యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ముఖ గుర్తింపు విజయవంతమైతే డిజిటల్ సర్టిఫికేట్ రూపొందుతుంది.
ఇది కూడా చదవండి: Horoscope Today: ఈ రోజు వీరికి పట్టిందల్లా బంగారమే.. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం
UMANG యాప్‌లో ఇలా దరఖాస్తు చేయండి
లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ముందుగా UMANG యాప్‌ను తెరవాలి. అందులో సెర్చ్ బార్‌లో Jeevan Pramaan అని టైప్ చేసి సంబంధిత సేవను ఎంచుకోవాలి. ఆ తర్వాత Generate Life Certificate ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని ఎంచుకోవాలి. మీ ఆధార్ నంబర్ నమోదు చేసి, ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్‌కు వచ్చిన ఓటీపీతో ధృవీకరణ పూర్తి చేయాలి. అనంతరం పేరు, పెన్షన్ రకం, సంస్థ పేరు, పెన్షన్ మంజూరు చేసే అధికారి, పెన్షన్ పంపిణీ సంస్థ, PPO నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి. అడిగిన ఇతర వివరాలను కూడా సరిచూసుకుని సమర్పించాలి.
ముఖ గుర్తింపుతో సర్టిఫికేట్ జనరేట్
వివరాలు నమోదు చేసిన తర్వాత AadhaarFaceRD యాప్ ద్వారా ముఖ గుర్తింపు పూర్తి చేయాలి. ఫోన్ కెమెరా ముందు ముఖాన్ని ఉంచి యాప్ సూచనలను పాటించాలి. ధృవీకరణ విజయవంతమైతే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అనంతరం మీకు SMS ద్వారా ప్రత్యేకమైన జీవన్ ప్రమాణ్ ఐడీ (Pramaan ID) వస్తుంది. ఈ ఐడీని భద్రపరుచుకోవాలి. UMANG యాప్‌లో View Certificate ఆప్షన్ ద్వారా సర్టిఫికేట్‌ను చూడవచ్చు. సమర్పించిన తర్వాత మీ పెన్షన్ పంపిణీ సంస్థకు డిజిటల్‌గా వివరాలు చేరతాయి. అయితే సర్టిఫికేట్ రూపొందినంత మాత్రాన సరిపోదు. అది సంబంధిత సంస్థకు చేరిందో లేదో కూడా నిర్ధారించుకోవాలి.
ఇంటి దగ్గరికే పోస్టుమ్యాన్
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం తెలియని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌ఓ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కలిసి ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ సదుపాయం ద్వారా పోస్టుమ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవక్ ఇంటికి వచ్చి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు లేదా బయోమెట్రిక్ విధానంతో సర్టిఫికేట్ రూపొందిస్తారు. ఈ సేవకు పెన్షనర్లు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సేవ కోసం 033-22029000 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC), ఈపీఎఫ్‌ఓ కార్యాలయంలో కూడా ఈ సేవను పొందవచ్చు.

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం విజయ్ సర్కార్ పడిపోతుందా?
Indian Railways: రైల్వే స్టేషన్లలో తాగునీరు, టాయిలెట్ల పరిస్థితిపై సుప్రీంకోర్టు సీరియస్
Kangana Ranaut: సోషల్ మీడియా పోస్టులతో చిక్కుల్లో కంగనా రనౌత్.. క్రిమినల్ కేసు నమోదు
Ration Card: రేషన్ కార్డుల స్థానంలో ఈ-రూపీ డిజిటల్ వోచర్లు.. కేంద్రం కొత్త ప్రతిపాదన ఇదే