శుక్రవారం, నవంబర్ 20, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Gold Price: ధంతేరస్ తర్వాత రూ.14,000 తగ్గిన బంగారం ధర.. పసిడి రేటు మళ్లీ రూ.లక్షకు దిగివస్తుందా?

Gold Rate Today

Gold Price: దేశీయ వస్తు మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరల పతనం వరుసగా నాలుగో రోజు కూడా కొనసాగింది. ముఖ్యంగా నవంబర్ 6వ తేదీన జరుపుకున్న ధంతేరస్ పండుగ నాటి నుంచి ఇప్పటివరకు పసిడి విలువలో సుమారు 10 శాతం వరకు క్షీణత నమోదైంది. ధంతేరస్ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,167 వద్ద ముగియగా, తాజాగా రూ.1,28,310 స్థాయికి పడిపోయింది. అంటే పండుగ తర్వాత నుంచి ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా రూ. 13,857 మేర తగ్గడం విశేషం. కేవలం నవంబర్ నెల మొత్తాన్ని పరిశీలించినా పసిడి రేటు రూ.11,876 తగ్గింది.

వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పసిడి

గురువారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధర ప్రారంభం నుంచే ఒత్తిడికి లోనైంది. ఉదయం రూ.1,28,320 వద్ద మొదలైన ట్రేడింగ్, ఒక దశలో రూ.1,504 నష్టపోయి రూ.1,28,310 కనిష్ట స్థాయిని తాకింది. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల పసిడిపై రూ. 8,385 మేర తగ్గుదల కనిపించింది. అయితే బంగారం ధరలు ఇలా పడిపోతుంటే, వెండి మార్కెట్ మాత్రం భిన్నంగా స్పందించింది. ఎంసీఎక్స్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,441 పెరిగి రూ.1,62,175 గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Cyclone Akvan: బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

బంగారం ధర రూ.లక్ష స్థాయికి దిగివస్తుందా?

ప్రస్తుతం సామాన్య ప్రజలందరి మదిలో మెదులుతున్న ప్రశ్న బంగారం ధర తిరిగి రూ.లక్షకు వస్తుందా అనేదే. దీనిపై కమోడిటీ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తూ.. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగనుందని, అందులో వడ్డీ రేట్లను 0.25 శాతం నుంచి 0.50 శాతం వరకు పెంచే అవకాశాలు బలంగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడంతో పలు కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల పెంపు వైపు మొగ్గు చూపుతున్నాయి.

రాబోయే రోజుల్లో మార్కెట్ను నిర్దేశించే అంశాలు

అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ వరుసగా పెరగడం బంగారం ధరలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వడ్డీ రేట్ల పెంపు అంచనాలు నిజమైతే రాబోయే రోజుల్లో పసిడి ధరలపై మరింత ఒత్తిడి పెరిగి రేట్లు ఇంకాస్త దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ వంటి అంశాలు మద్దతుగా నిలిస్తే మరీ లక్ష రూపాయల స్థాయికి పడిపోవడం కష్టమేనని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.