శుక్రవారం, నవంబర్ 20, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Food Poisoning: బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు.. హైదరాబాదులో కలకలం

Mandi Biryani

Food Poisoning: హైదరాబాద్‌లో మరో ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటన కలకలం రేపింది. అంబర్‌పేటలోని ఓ హోటల్‌ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుని తిన్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు మొదలవడంతో బాధితులను ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో నగరంలో హోటళ్లలో ఆహార నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది.

నవంబర్ 15న మండీ బిర్యానీ తిన్న కుటుంబం

వివరాల ప్రకారం.. రామంతపూర్‌, అంబర్‌పేట ప్రాంతాలకు చెందిన ఓ కుటుంబం నవంబర్‌ 15న గాంధీ బొమ్మ సమీపంలోని ముక్రం బిర్యానీ హోటల్‌ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి భోజనం చేశారు. అయితే తిన్న కొద్దిసేపటికే తొమ్మిది మందికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. బాధితుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు కొన్ని వార్తా కథనాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: BSNL New Plans: డేటా వద్దు.. కాల్స్ చాలు.. బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మూడు చౌక రీఛార్జ్ ప్లాన్లు

ఫీవర్‌ ఆసుపత్రి నుంచి ఉస్మానియాకు..

మొదట బాధితులకు స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు సమాచారం. అయితే ఓ మహిళకు నరాల సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం నవంబర్‌ 18న బాధితులను నల్లకుంటలోని ప్రభుత్వ ఫీవర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్యులు వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు.

హోటల్‌పై విచారణ

ఈ ఘటనపై పోలీసులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కూడా విచారణ చేపట్టనున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. హోటల్‌లో ఆహార తయారీ, నిల్వ విధానాలు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించాల్సి ఉంది. అయితే బాధితులు అస్వస్థతకు గురవడానికి బిర్యానీ కలుషితం కావడమే కారణమా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఆహార నమూనాల పరీక్షలు, అధికారుల విచారణ తర్వాతే అసలు విషయం తేలనుంది.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.