శుక్రవారం, నవంబర్ 20, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Muslim Population: ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా..2070 నాటికి ఎన్ని కోట్లంటే?

Muslim Population

Muslim Population: ప్రపంచ జనాభాలో వివిధ మతాలకు చెందినవారి సంఖ్య రాబోయే దశాబ్దాల్లో మారనుంది. ముఖ్యంగా ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న మత సమూహంగా కొనసాగుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనం వెల్లడించింది. మహిళల సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటం, యువత సంఖ్య అధికంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే 2070 నాటికి ప్రపంచవ్యాప్తంగా ముస్లింల సంఖ్య 360 కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది.

మహిళల సంతానోత్పత్తి రేటు 3.1

ప్యూ అంచనాల ప్రకారం.. 2020–2025 మధ్య ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 3.1గా నమోదైంది. అంటే ప్రస్తుత జనన రేట్లు జీవితాంతం కొనసాగితే ఒక మహిళకు సగటున 3.1 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఈ గణాంకం సూచిస్తుంది. ఇతర మతాలకు చెందిన మహిళల్లో ఈ రేటు 2.0గా ఉంది. ఈ తేడా కూడా ముస్లిం జనాభా పెరుగుదలకు ఒక ముఖ్య కారణంగా అధ్యయనం పేర్కొంది. అయితే దేశాలు, ప్రాంతాలను బట్టి ఈ రేటులో తేడాలు ఉంటాయి.

యువత సంఖ్య ఎక్కువగా ఉండటం మరో కారణం

ముస్లిం జనాభాలో యువత వాటా ఎక్కువగా ఉంది. 2020 అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో ప్రతి పది మందిలో ఆరుగురు 30 ఏళ్లలోపు వారే. ఇతర మతాల వారిలో ఈ వయసు వారున్న వాటా సగం కంటే తక్కువగా ఉంది. వీరిలో చాలామంది రాబోయే సంవత్సరాల్లో కుటుంబాలను ప్రారంభించే వయసుకు చేరుకుంటారు. దీంతో జననాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్యూ అధ్యయనం వివరించింది.

2035 నాటికి అతిపెద్ద మత సమూహంగా?

2020లో ప్రపంచవ్యాప్తంగా ముస్లింల సంఖ్య సుమారు 202 కోట్లు. ప్రస్తుత జనాభా ధోరణులు కొనసాగితే 2035 నాటికి క్రైస్తవులను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మత సమూహంగా ముస్లింలు మారవచ్చని ప్యూ అంచనా వేసింది. 2070 నాటికి వారి సంఖ్య 360 కోట్లకు చేరి, ప్రపంచ జనాభాలో 36 శాతం వాటా కలిగి ఉండవచ్చని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Gold Price: ధంతేరస్ తర్వాత రూ.14,000 తగ్గిన బంగారం ధర.. పసిడి రేటు మళ్లీ రూ.లక్షకు దిగివస్తుందా?

భారత్‌లోనూ ముస్లిం జనాభా పెరుగుదలపై అంచనా

2020లో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. భారత్‌లో 2020 నాటికి ముస్లింల సంఖ్య 21.3 కోట్లు ఉన్నట్లు ప్యూ అంచనా వేసింది. 2070 నాటికి ఈ సంఖ్య 33.4 కోట్లకు చేరవచ్చని పేర్కొంది. అదే సమయానికి పాకిస్థాన్ 46.1 కోట్ల ముస్లింలతో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరవచ్చని అంచనా వేసింది. ఇవి భవిష్యత్తుకు సంబంధించిన అంచనాలే తప్ప ఖచ్చితమైన లెక్కలు కావు.

జననాలతో పాటు వలసల ప్రభావం కూడా

ముస్లిం జనాభా పెరుగుదలలో ప్రధాన పాత్ర జననాలదేనని ప్యూ అధ్యయనం చెబుతోంది. జననాల సంఖ్య మరణాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల సహజ జనాభా పెరుగుదల కనిపిస్తోంది. వలసలు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికాలో వలసల కారణంగా ముస్లిం జనాభా పెరగవచ్చని అంచనా. అయితే ప్రపంచవ్యాప్త పెరుగుదలలో మత మార్పిడి ప్రభావం తక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ అధ్యయనం 201 దేశాలు, ప్రాంతాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలించింది.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.