Ration Card: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ జాబితాలో మీరుంటే కార్డు కట్ కావడం ఖాయం

Ration Card: దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అర్హులైన నిరుపేదలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో అక్రమంగా రేషన్ కార్డులు పొందిన వారిని గుర్తించే పనిని వేగవంతం చేసింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో అనర్హులుగా తేలిన లక్షలాది కుటుంబాల రేషన్ కార్డులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పారదర్శకంగా పథకాలను అమలు చేసేందుకే ఈ కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది.
కారు, ఏసీ, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కార్డు కట్
ఉచిత బియ్యం నుంచి ఆరోగ్య బీమా దాకా ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి రేషన్ కార్డే ప్రధాన ఆధారం. అయితే దీనిని ఆసరాగా చేసుకుని ఎంతోమంది అనర్హులు అక్రమ మార్గాల్లో కార్డులు సంపాదించారని కేంద్రం గుర్తించింది. ఆదాయపు పన్ను (ఇన్కమ్ ట్యాక్స్) చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంతంగా కారు, ఏసీ సౌకర్యాలు కలిగి ఉండి అధిక ఆదాయం పొందుతున్న వారు కూడా ఉచిత రేషన్ తీసుకుంటున్నట్లు విచారణలో బయటపడింది. ఇలాంటి వారందరి కార్డులను ఏరివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.
13.2 శాతం మంది అనర్హులే
దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద ఉచిత రేషన్ పొందుతున్న వారిలో ఏకంగా 13.2 శాతం మంది అనర్హులు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. అనర్హుల సంఖ్యలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవగా, త్రిపుర, తమిళనాడు, మేఘాలయ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున అనర్హులు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు
రాష్ట్రాలకు మార్గదర్శకాలు
అనర్హుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డుదారులందరికీ ఈకేవైసీ (eKYC) ప్రక్రియను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో పాటు వాహన రిజిస్ట్రేషన్లు, ఆదాయపు పన్ను రికార్డులు, ఇతర ప్రభుత్వ డేటాబేస్‌లను అనుసంధానించి అనర్హులను గుర్తించనున్నారు.
ఒకే కుటుంబంలో అదనపు కార్డులకు చెక్
ప్రభుత్వం చేపట్టబోయే ఈ ప్రత్యేక డ్రైవ్ వల్ల ఒకే కుటుంబానికి చెందిన అనవసరపు కార్డులు, అర్హత లేని సభ్యుల పేర్లు జాబితా నుంచి తొలగిపోనున్నాయి. కేంద్రం తీసుకోబోతున్న ఈ కీలక నిర్ణయంతో దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల జాబితాలో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజమైన పేదలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Bisleri: బిస్లెరి నీళ్లపై వివాదం.. మా వాటర్ సురక్షితమేనంటూ కంపెనీ ప్రకటన
EPFO: పెన్షన్ తీసుకునేవారికి కీలక అలర్ట్.. ఇంట్లోనే ఇలా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించండి
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం విజయ్ సర్కార్ పడిపోతుందా?
Indian Railways: రైల్వే స్టేషన్లలో తాగునీరు, టాయిలెట్ల పరిస్థితిపై సుప్రీంకోర్టు సీరియస్