సోమవారం, నవంబర్ 23, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Bomb Threat: నవంబర్ 26న ముంబై తరహా దాడులంటూ హెచ్చరిక.. హైదరాబాద్‌లో హై అలర్ట్

Hyderabad Bomb Threat

Bomb Threat: హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్ కలకలం రేపింది. కాచిగూడ రైల్వేస్టేషన్, అక్కడి హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుంటామని అందులో పేర్కొన్నట్లు సమాచారం. నవంబర్ 26న 2008 ముంబై ఉగ్రదాడుల తరహాలో హైదరాబాద్‌లో దాడులు చేస్తామని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 21న నగర పోలీసులకు ఈ మెయిల్ అందినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ బెదిరింపు సందేశం నకిలీ అయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.

లష్కరే తోయిబా పేరుతో ఈమెయిల్

పోలీసులకు అందిన ఈమెయిల్‌లో లష్కరే తోయిబా పేరు ఉన్నట్లు సమాచారం. ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులమంటూ పేర్కొన్న పంపినవారు.. నవంబర్ 26న హైదరాబాద్‌లో ముంబై తరహా దాడులు చేస్తామని హెచ్చరించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్‌గా పేర్కొంటున్న లతీఫ్ భట్, అతని అనుచరులు హతమైనందుకు ప్రతీకారంగా దాడులు చేస్తామని మెయిల్‌లో చెప్పినట్లు సమాచారం. అయితే ఈ మెయిల్ నిజంగా ఆ ఉగ్రవాద సంస్థ నుంచే వచ్చిందా? లేక ఎవరైనా కావాలనే ఆ పేరును ఉపయోగించారా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. పంపినవారి గుర్తింపు, వారి ఉద్దేశం గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాచిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ ప్లాజా టార్గెట్‌గా..

ఈ బెదిరింపు ఈమెయిల్‌లో కాచిగూడ రైల్వేస్టేషన్‌తో పాటు హోటల్ టూరిస్ట్ ప్లాజా పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లో పేలుళ్లు జరుపుతామని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అప్రమత్తమైంది. నగరంలోని పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, హోటళ్లు, ప్రార్థనా మందిరాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించింది. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, ఎవరూ తీసుకెళ్లకుండా వదిలేసిన వస్తువులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించింది.

ఇది కూడా చదవండి: Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఏపీలో నాలుగు రోజుల పాటు వర్ష సూచన

అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు

బెదిరింపు నేపథ్యంలో పోలీసులు యాంటీ సబోటేజ్ తనిఖీలు చేపట్టారు. కాచిగూడ రైల్వేస్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాతో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. నగరంలో పెట్రోలింగ్ పెంచడంతో పాటు కీలక ప్రాంతాల్లో పోలీసుల ఉనికిని మరింత స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఐపీ అడ్రస్ లేదా ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా పంపించారు? దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫేక్ మెయిల్ అయి ఉండొచ్చని పోలీసుల అనుమానం

ఈ బెదిరింపు ఈమెయిల్‌ను ప్రాథమికంగా నకిలీదిగా భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కూడా ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఫేక్ అయి ఉండొచ్చని పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే దీనిపై దర్యాప్తు పూర్తయ్యే వరకు అప్రమత్తత కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ కూడా ప్రజలు పుకార్లను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపి భయాందోళనలు సృష్టించవద్దని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన వస్తువులు కనిపిస్తే వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మెయిల్ పంపిన వ్యక్తుల ఆచూకీ తెలుసుకునే పనిలో ఉన్నారు.

Google వార్తల్లో మమ్మల్ని మీ ప్రాధాన్య వనరుగా జోడించండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.