సోమవారం, నవంబర్ 23, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఏపీలో నాలుగు రోజుల పాటు వర్ష సూచన

Weather Update

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా మారిపోయింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌పై ద్రోణి ప్రభావం కనిపిస్తుంటే, మరోవైపు తెలంగాణను చలి వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని ఉపరితల ఆవర్తనం కూడా ఇందులో కలిసిపోయింది. దిగువ స్థాయిలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తుండటంతో నవంబర్ 23, 24 తేదీలతో పాటు 26 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని హెచ్చరించింది.

హైదరాబాద్‌లో ఎలా ఉంటుంది?

భాగ్యనగరం హైదరాబాద్‌లో సోమవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. అయితే నగరంలో భారీ వర్షం కురిసే సూచనలేవీ లేవని, ప్రత్యేక వర్ష హెచ్చరిక కూడా జారీ కాలేదని అధికారులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. పగలు పొడి వాతావరణమే ఉన్నా, రాత్రి వేళల్లో, తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తాయి కాబట్టి ఉదయం బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.6 డిగ్రీలు, కోహీర్‌లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. న్యాల్కల్, ఝరాసంగం ప్రాంతాల్లో 10 డిగ్రీల సమీపంలో, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 10.5 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్, ధారూర్‌లలో 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్ర సగటు పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 19 డిగ్రీల మధ్య ఉండొచ్చని అంచనా. అయితే నవంబర్ 24 నుంచి 26 మధ్య తెలంగాణలోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Bisleri Water: బిస్లరీ వాటర్‌లో క్యాన్సర్ కారకాలు.. రెండు ల్యాబ్‌లలోనూ సురక్షితం కాదని నిర్ధారణ

ఏపీలో ఉదయం పొగమంచు అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోనూ ఒకే రకమైన వాతావరణం ఉండదు. ద్రోణి వల్ల కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ జల్లులు పడినా, మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువగా పొడి వాతావరణమే కనిపిస్తుంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 33 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసే అవకాశం ఉన్నందున హైవేలపై ప్రయాణించే వాహనదారులు వేగాన్ని తగ్గించి, ముందు వెళ్తున్న వాహనాలకు తగిన దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మత్స్యకారులు అధికారిక హెచ్చరికలు గమనించాలి

నవంబర్ 23న ఐఎండీ విడుదల చేసిన జాతీయ బులెటిన్ ప్రకారం, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ తీర ప్రాంతాల్లో నవంబర్ 26 వరకు బలమైన గాలులు, ఉరుములతో కూడిన వాతావరణం ఉండొచ్చు. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లే ముందు స్థానిక వాతావరణ కేంద్రాల తాజా హెచ్చరికలను కచ్చితంగా పరిశీలించాలి. ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి అధికారిక ప్రకటనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

Google వార్తల్లో మమ్మల్ని మీ ప్రాధాన్య వనరుగా జోడించండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.