Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన.. పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు ఫ్రీ హ్యాండ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. గ్రామాల్లో ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న జనసేన నాయకులు, కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే వారు ఎవరైనా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాదిరిగా పంచాయతీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లు ఉండవని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న జనసైనికులకు అవకాశం లభించనుంది.
జనసైనికులకు పవన్ కల్యాణ్ ఫ్రీ హ్యాండ్
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ఈ ఎన్నికల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ శ్రేణులను స్థానిక నాయకులు ఎవరూ అడ్డుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలకు దూరం
గతంలో జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు జరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో స్థానాల పంపకం విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. తమకు తగిన ప్రాధాన్యం దక్కలేదని కొందరు జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అలాంటి సర్దుబాట్లకు అవకాశం లేకుండా పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ గ్రామంలోనైనా జనసేన తరఫున పోటీ చేయాలనుకునేవారు తమ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తరహాలో స్థానాల పంపకాలు ఉండవని పార్టీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: New Rules: పెళ్లి చేసుకుంటున్నారా? అయితే ఈ కొత్త రూల్ తెలుసుకోవాల్సిందే
జనసేన అభ్యర్థుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్
మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు పార్టీ ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే సమస్యల వరకు పార్టీ శ్రేణులకు సహాయం అందించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది. హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారని జనసేన కేంద్ర కార్యాలయం వెల్లడించింది. అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.
పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పర్యవేక్షణ
హెల్ప్ డెస్క్ ద్వారా అందే ఫిర్యాదులు, సమస్యలను పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని జనసేన సూచించింది. ఈ ప్రత్యేక వ్యవస్థ కార్యకలాపాలను పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షించనున్నారు. దీంతో గ్రామస్థాయిలో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులకు పార్టీ నుంచి అవసరమైన సహకారం అందనుంది. మొత్తంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కార్యకర్తలకు స్వేచ్ఛ కల్పించడంతో పాటు, వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జనసేన తాజా నిర్ణయంలో కీలకంగా మారింది.

AP Pension: ఏపీ పింఛన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈసారి రెండు రోజుల ముందే డబ్బులు
Rice Price: ఏపీ ప్రజలకు భారీ ఊరట.. కిలో బియ్యం రూ.47 నుంచే.. కొత్త ధరలు ఇవే
Cyclone Akvan: ఉత్తరాంధ్రకు తుపాన్ ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
AP Govt Scheme: ఏపీలో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.231 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు