సోమవారం, నవంబర్ 23, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

ICE Arrests: అమెరికా ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. అధికారులపై వేడి కాఫీ విసిరిన మహిళ

US

ICE Arrests: అమెరికాలోని సియాటెల్‌ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు విమానం ఎక్కుతున్న సమయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. ముసుగులు ధరించిన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణికురాలు అధికారులపై వేడి కాఫీ విసిరినట్లు అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగం ఆరోపించింది. ఈ ఘటనతో విమాన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానం బయలుదేరడం కూడా ఆలస్యమైంది. ఈ వ్యవహారంపై విమానయాన సంస్థతో పాటు స్థానిక అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

వీసా గడువు ముగిసినా అమెరికాలోనే

ఈ ఘటన నవంబర్‌ 21న ఉదయం సుమారు 8.05 గంటలకు సియాటెల్‌-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. లాస్‌ ఏంజెలెస్‌కు వెళ్లాల్సిన అలాస్కా ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 1306లో ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. మెక్సికోకు చెందిన రికార్డో లారొండో మెండోజా అనే వ్యక్తి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉంటున్నాడని ICE అధికారులు ఆరోపించారు. అతడిని అరెస్ట్‌ చేసేందుకు ముందుగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు వెల్లడించారు. అయితే ఈ చర్యతో విమానం ఎక్కేందుకు క్యూలో ఉన్న ప్రయాణికుల మధ్య ఒక్కసారిగా గందరగోళం మొదలైంది.

అధికారులపై వేడి కాఫీ విసిరిందని ఆరోపణ

రికార్డోను అదుపులోకి తీసుకునే సమయంలో కొందరు ప్రయాణికులు అధికారుల విధులకు అడ్డుపడ్డారని, వారిపై దాడికి ప్రయత్నించారని ICE ఆరోపించింది. ఈ క్రమంలో సోఫియా హెర్నాండెజ్ మెజియా అనే మరో మహిళా ప్రయాణికురాలు అధికారులపై వేడి కాఫీ విసిరినట్లు తెలిపింది. ఆమె కూడా మెక్సికోకు చెందిన వ్యక్తేనని, వీసా గడువు ముగిసిన తర్వాత అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించామని ICE పేర్కొంది. దీంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఫెడరల్ అధికారిపై దాడి చేసిన అభియోగంతో ఆమెపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇవన్నీ ICE చేసిన ఆరోపణలేనని, వాటిపై సంబంధిత వ్యక్తుల వాదనలు లేదా వారి న్యాయవాదుల స్పందన బయటకు రాలేదని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Muslim Population: ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా..2070 నాటికి ఎన్ని కోట్లంటే?

సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియోలు

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిలో ముసుగులు ధరించిన అధికారులు ప్రయాణికులను పక్కకు నెట్టడం, ఓ వ్యక్తిని నేలపై అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం కనిపిస్తోంది. మరోవైపు, ఓ మహిళ తన కుటుంబ సభ్యుడిని తీసుకెళ్తున్నారంటూ ఏడుస్తూ అధికారులను వేడుకోవడం వినిపిస్తోంది. ఆ వ్యక్తికి వర్క్‌ పర్మిట్‌ ఉందని ఆమె చెబుతున్నట్లు వీడియోల్లో ఉంది. అక్కడున్న ప్రయాణికులు భయంతో పక్కకు నిలబడిపోయారని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఈ ఘటనతో ఫ్లైట్‌ 1306 బయలుదేరడం ఆలస్యమైంది. ఉదయం 8.10 గంటలకు బయలుదేరాల్సిన విమానం స్థానిక సమయం ప్రకారం ఉదయం 11 గంటలకు బయలుదేరినట్లు రాయిటర్స్‌ తెలిపింది. పలువురు ప్రయాణికులను ఇతర విమానాల్లోకి మార్చినట్లు కూడా వెల్లడించింది.

ఎయిర్‌లైన్స్‌కు ముందస్తు సమాచారం లేదు

ఈ ఘటనపై అలాస్కా ఎయిర్‌లైన్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ICE అధికారులు విమానంలో ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో చేపట్టిన చర్య గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రయాణికులు, సిబ్బందికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితులపై విచారం వ్యక్తం చేసింది. విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు చూసే పోర్ట్‌ ఆఫ్‌ సియాటెల్‌ కూడా ఈ ఘటనపై అసంతృప్తి తెలిపింది. ఇలాంటి చర్యల సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించారా లేదా అన్నది పరిశీలించేందుకు కేంద్ర అధికారులతో మాట్లాడుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు వాషింగ్టన్‌ గవర్నర్‌ బాబ్‌ ఫెర్గూసన్‌ ICE తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ముసుగులు ధరించిన అధికారులు ప్రయాణికుల మధ్య ఇలా అరెస్టులు చేయడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల్లో ICE చర్యలపై విమానయాన సంస్థలు ప్రశ్నించాలని కూడా ఆయన కోరారు.

Google వార్తల్లో మమ్మల్ని మీ ప్రాధాన్య వనరుగా జోడించండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.