సోమవారం, నవంబర్ 23, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Bisleri Water: బిస్లరీ వాటర్‌లో క్యాన్సర్ కారకాలు.. రెండు ల్యాబ్‌లలోనూ సురక్షితం కాదని నిర్ధారణ

Bisleri Water

Bisleri Water: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీకి (Bisleri) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ ప్రాంగణం నుంచి సేకరించిన తాగునీటి నమూనాలు సురక్షితం కాదని తేలడంతో, బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) అనుమతి ఇచ్చింది. ఈ పరిణామం మార్కెట్లో లభించే ప్యాకేజ్డ్ తాగునీటి నాణ్యతపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.

FSSAI వెల్లడించిన వివరాల ప్రకారం, అధికారులు బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రాంగణం నుంచి 'ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (మినరల్ వాటర్ మినహా)' నమూనాను సేకరించారు. సాధారణ నాణ్యతా తనిఖీల్లో భాగంగా దాన్ని ప్రయోగశాలకు పంపగా, ఆ నీటిలో 'బ్రోమేట్' స్థాయి నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం ఆ నీరు సురక్షితం కాదని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫలితంపై కంపెనీ అప్పీల్ చేసుకోవడంతో నమూనాను మరోసారి పరీక్షించేందుకు రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు.

కంపెనీ అప్పీల్ తర్వాత రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలో నిర్వహించిన రెండో పరీక్షలోనూ బిస్లరీకి ఊరట దక్కలేదు. ఈసారి ఆ నీటి నమూనాలో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్(PAHs) ఉన్నట్లు గుర్తించినట్లు FSSAI తెలిపింది. దీంతో రెండో ల్యాబ్ కూడా ఆ నమూనా సురక్షితం కాదని తేల్చింది. నీటిలో బ్రోమేట్ పరిమితికి మించి ఉండకూడదు. ఇక PAHs అనేవి రసాయన సమ్మేళనాల సమూహం కాగా, వీటిలో కొన్నింటికి క్యాన్సర్ ముప్పుతో సంబంధం ఉన్నట్లు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ నమూనాలో ఏ రకమైన PAHs ఎంత మోతాదులో ఉన్నాయనే వివరాలను FSSAI బహిరంగంగా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: SSY: నెలకు రూ.2 వేలు కడితే చాలు.. మీ కూతురి చేతికి రూ.11 లక్షలు

రెండు ల్యాబ్ నివేదికల ఆధారంగా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించిన FSSAI, బిస్లరీ ఇంటర్నేషనల్‌పై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అనుమతించింది. అంటే ఇకపై కంపెనీపై కోర్టులో చట్టపరమైన విచారణ జరగనుంది. అయితే ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం అంటే కంపెనీ దోషిగా తేలిపోయినట్లు కాదని, తుది తీర్పు న్యాయ ప్రక్రియలోనే వెలువడుతుందని గమనించాలి. ఇదే సమయంలో వసంత్ మసాలా, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా, మిమాంసా ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ సంస్థలపైనా ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి ఇచ్చింది.

నిబంధనలు ఉల్లంఘించిన ఇతర ఆహార సంస్థలపైనా FSSAI కఠినంగా వ్యవహరించింది. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని ఉర్మి లైఫ్‌సైన్సెస్ ఎల్ఎల్‌పీ, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసింది. అలాగే ఆశా కన్ఫెక్షనరీ తయారు చేసిన ప్యాక్డ్ చాక్లెట్ ఫిల్లింగ్ కుకీస్ సురక్షితం కాదని తేలడంతో వాటిని వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని (రీకాల్ ఆర్డర్) ఆదేశించింది. ఈ ఏడాది ఆహార తయారీ సంస్థలతో పాటు ఈ-కామర్స్ వేదికలు, ఎనర్జీ డ్రింక్స్, మద్యం తయారీదారులపైనా తనిఖీలు, నిఘా పెంచినట్లు FSSAI స్పష్టం చేసింది.

Google వార్తల్లో మమ్మల్ని మీ ప్రాధాన్య వనరుగా జోడించండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.