సోమవారం, నవంబర్ 23, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Bisleri: బిస్లెరి నీళ్లపై వివాదం.. మా వాటర్ సురక్షితమేనంటూ కంపెనీ ప్రకటన

Bisleri

Bisleri: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరి చుట్టూ నీటి నాణ్యత వివాదం మొదలైంది. కంపెనీకి చెందిన ఓ నీటి నమూనాలో నిర్ణీత పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఆరోపణలను బిస్లెరి తప్పుబట్టింది. తర్వాత నిర్వహించిన స్వతంత్ర ల్యాబ్ పరీక్షల్లో బ్రోమేట్ పరిమాణం అనుమతించిన స్థాయిలోనే ఉందని స్పష్టం చేసింది. తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగడానికి సురక్షితమేనని నవంబర్ 23న ప్రకటించింది. మరోవైపు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి తమకు ఎలాంటి అధికారిక నోటీసు అందలేదని కూడా కంపెనీ తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో ల్యాబ్ టెస్ట్ రిజల్ట్స్, కంపెనీ వాదన, నియంత్రణ సంస్థ చర్యలపై చర్చ మొదలైంది.

గోవా ప్లాంట్‌లో 6 నీటి నమూనాల సేకరణ

బిస్లెరి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వివాదం 2025 సెప్టెంబర్‌లో గోవాలోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన ఓ బ్యాచ్‌కు సంబంధించినది. అదే ఏడాది సెప్టెంబర్ 30న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు అక్కడి నుంచి ఆరు నీటి నమూనాలను సేకరించారు. తొలి దశలో నిర్వహించిన పరీక్షల్లో ఐదు నమూనాలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. అయితే ఆరో నమూనాలో లీటరు నీటికి 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ ఉన్నట్లు తేలింది. ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం అనుమతించిన గరిష్ఠ పరిమితి 10 మైక్రోగ్రాములు మాత్రమే. అంటే ఆ నమూనాలో బ్రోమేట్ పరిమాణం నిర్ణీత స్థాయిని మించిందన్నమాట. ఈ ఫలితాలను సవాలు చేస్తూ బిస్లెరి 2025 నవంబర్ 22న అప్పీల్ చేసుకుంది. దీంతో ఆ నమూనాను మరోసారి పరీక్షించేందుకు రిఫరల్ ల్యాబ్‌కు పంపించారు.

రెండో పరీక్షలో బ్రోమేట్ పరిమితిలోనే

రిఫరల్ ల్యాబ్ పరీక్షలో బ్రోమేట్ పరిమాణం అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని బిస్లెరి తెలిపింది. అయితే అదే నమూనాలో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు ల్యాబ్ గుర్తించిందని కంపెనీ వెల్లడించింది. ఇవి పలు రకాల రసాయన సమ్మేళనాల సమూహం. వీటిలో కొన్ని ఆరోగ్యానికి హాని కలిగించేవి, క్యాన్సర్ ప్రమాదంతో సంబంధం ఉన్నవి. ఈ నేపథ్యంలో ఒకే నమూనాకు సంబంధించి వేర్వేరు పరీక్షల్లో వచ్చిన ఫలితాలపై బిస్లెరి సందేహాలు వ్యక్తం చేసింది. అనంతరం అదే నమూనాను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదం పొందిన మరో స్వతంత్ర ల్యాబ్‌లో పరీక్షించినట్లు తెలిపింది. ఆ పరీక్షలోనూ బ్రోమేట్ పరిమాణం నిర్ణీత పరిమితిలోనే ఉందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ స్వతంత్ర పరీక్షలో PAHs విషయంలో ఏమి తేలిందనే వివరాలను కంపెనీ తన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించలేదు. అందువల్ల బ్రోమేట్ విషయంలో వచ్చిన ఫలితాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఆ నమూనా పూర్తిగా సురక్షితమని నిర్ధారించలేం.

ఇది కూడా చదవండి: Bomb Threat: నవంబర్ 26న ముంబై తరహా దాడులంటూ హెచ్చరిక.. హైదరాబాద్‌లో హై అలర్ట్

ఫిబ్రవరిలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి నివేదిక

స్వతంత్ర ల్యాబ్ పరీక్షల ఫలితాలను 2026 ఫిబ్రవరి 2న అధికారిక లేఖ ద్వారా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి పంపించినట్లు బిస్లెరి తెలిపింది. ఆ తర్వాత నియంత్రణ సంస్థ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని, దీంతో ఈ వ్యవహారం ముగిసిందని భావించామని కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకు ఈ ప్రాసిక్యూషన్‌కు సంబంధించి ఈమెయిల్ ద్వారా కానీ, భౌతిక రూపంలో కానీ తమకు ఎలాంటి నోటీసు అందలేదని వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెబ్‌సైట్‌లోనూ సంబంధిత నోటీసును గుర్తించలేకపోయామని తెలిపింది. మరోవైపు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మాత్రం ల్యాబ్ పరీక్షల్లో నమూనా అసురక్షితంగా తేలడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద కంపెనీపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది. ఇక్కడ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం అంటే కంపెనీ దోషిగా తేలిపోయిందని కాదు. ఇది చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు తీసుకున్న నిర్ణయం మాత్రమే.

10 దశల్లో 90కి పైగా పరీక్షలు చేస్తున్నాం

తమ ఉత్పత్తుల నాణ్యతపై బిస్లెరి మరోసారి వివరణ ఇచ్చింది. తయారీ ప్రక్రియలో 10 దశల్లో 90కి పైగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. తాగునీటి భద్రత తమకు అత్యంత ముఖ్యమని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐతో పూర్తిగా సహకరిస్తూ తగిన నియంత్రణ ప్రక్రియ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొంది. అయితే ఈ వివాదం ఒక్క బ్యాచ్‌కు సంబంధించిన నమూనా పరీక్షలతో మొదలైందని గుర్తుంచుకోవాలి. దీనిని ఆధారంగా చేసుకుని మార్కెట్లో ఉన్న బిస్లెరి బ్రాండ్ నీళ్లన్నీ కలుషితమని చెప్పడానికి ఆధారాలు లేవు. అదే సమయంలో కంపెనీ ఇచ్చిన వివరణతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించిన భద్రతా సమస్యలు పరిష్కారమయ్యాయని కూడా చెప్పలేం. నమూనా పరీక్షలపై తుది స్పష్టత, నియంత్రణ సంస్థ తదుపరి చర్యలు, కంపెనీ సమర్పించిన నివేదికల పరిశీలన తర్వాతే ఈ వివాదంపై పూర్తి వివరాలు తెలుస్తాయి.

Google వార్తల్లో మమ్మల్ని మీ ప్రాధాన్య వనరుగా జోడించండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.