సోమవారం, నవంబర్ 23, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

SSY: నెలకు రూ.2 వేలు కడితే చాలు.. మీ కూతురి చేతికి రూ.11 లక్షలు

Sukanya Samriddhi Yojana

SSY: కూతురి చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఇప్పటి నుంచే డబ్బు దాచాలనుకుంటున్న తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన మంచి పొదుపు పథకంగా నిలుస్తోంది. నెలకు చిన్న మొత్తంతోనే దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే అవకాశం ఇందులో ఉంది. నెలకు రూ.2,000 లేదా రూ.5,000 జమ చేస్తే ఎంత డబ్బు వస్తుంది? 15 ఏళ్ల తర్వాత డబ్బులు కట్టకపోయినా వడ్డీ ఎలా పెరుగుతుంది? ఖాతా తెరవడానికి ఉండాల్సిన అర్హతలు, మధ్యలో డబ్బులు తీసుకునే నిబంధనలు ఏంటి? వివరంగా చూద్దాం.

సుకన్య సమృద్ధి పథకంలో వడ్డీ ఎంత?

2026 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సుకన్య సమృద్ధి ఖాతాపై ప్రభుత్వం ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న 8.2 శాతం వడ్డీ రేటు ఖాతా పూర్తయ్యే 21 ఏళ్ల పాటు కొనసాగుతుందని చెప్పలేం. భవిష్యత్తులో రేటు మారితే చివరికి వచ్చే మొత్తం కూడా మారుతుంది. ప్రస్తుతం ఈ పథకానికి 8.2 శాతం వడ్డీ రేటు కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాల వివరాలు చెబుతున్నాయి.

నెలకు రూ.2,000, రూ.5,000 కడితే ఎంత వస్తుంది?

కూతురి పేరు మీద నెలనెలా కొంత మొత్తం జమ చేస్తూ వెళ్తే దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. ఈ పథకంలో మొదటి 15 ఏళ్ల పాటు డబ్బులు జమ చేయాలి. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. 8.2 శాతం వడ్డీ రేటు మొత్తం కాలానికి మారకుండా కొనసాగుతుందని, ప్రతి నెలా 5వ తేదీలోపు డబ్బులు జమ చేస్తారని అనుకుంటే అంచనా లెక్కలు ఇలా ఉంటాయి.

నెలవారీ పొదుపు 15 ఏళ్లలో జమ చేసే మొత్తం 21 ఏళ్లకు అంచనా మెచ్యూరిటీ

రూ.2,000 రూ.3.60 లక్షలు రూ.11.09 లక్షలు

రూ.5,000 రూ.9 లక్షలు రూ.27.73 లక్షలు

రూ.12,500 రూ.22.50 లక్షలు రూ.69.33 లక్షలు

ఈ లెక్కలు ప్రస్తుత వడ్డీ రేటు 21 ఏళ్లూ కొనసాగుతుందనే అంచనాతో వేసినవి మాత్రమే. ప్రభుత్వం మధ్యలో వడ్డీ రేటును మార్చితే అసలు మెచ్యూరిటీ మొత్తం తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. నెలకు రూ.12,500 అంటే ఏడాదికి రూ.1.5 లక్షలు. ఇది ఈ పథకంలో అనుమతించిన గరిష్ఠ వార్షిక జమ పరిమితి. వడ్డీ లెక్కింపులో ప్రతి నెలా 5వ తేదీ నుంచి నెలాఖరు మధ్య ఉన్న కనిష్ఠ నిల్వను పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే వీలైతే 5వ తేదీలోపే డబ్బులు జమ చేయడం మంచిది.

15 ఏళ్ల తర్వాత డబ్బులు కట్టకపోయినా వడ్డీ వస్తుందా?

ఈ పథకంలో ఉన్న మరో ముఖ్యమైన విషయం ఇదే. ఖాతా తెరిచిన తర్వాత మొదటి 15 ఏళ్ల పాటు మాత్రమే డబ్బులు జమ చేయాలి. ఆ తర్వాత కొత్తగా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే ఖాతా వెంటనే మెచ్యూర్‌ కాదు. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 21 ఏళ్లు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఈ మధ్య ఉన్న ఆరు ఏళ్ల పాటు ఖాతాలో ఉన్న మొత్తంపై నిబంధనల ప్రకారం వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. అందువల్ల కొత్తగా పెట్టుబడి పెట్టకపోయినా పాత మొత్తంపై వడ్డీ పెరుగుతూ ఉంటుంది.

ఇది కూడా చదవడి: Cyclone Akvan: ఉత్తరాంధ్రకు తుపాన్‌ ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఖాతా ఎవరు తెరవొచ్చు? ఎంత డబ్బు జమ చేయాలి?

పదేళ్లలోపు వయసున్న ఆడపిల్ల పేరు మీద తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఈ ఖాతాను తెరవొచ్చు. పోస్టాఫీసుతో పాటు ఈ సదుపాయం ఉన్న బ్యాంకుల్లోనూ ఖాతా ప్రారంభించవచ్చు. కనీసం రూ.250తో ఖాతా తెరవొచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 జమ చేయాలి. గరిష్ఠంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకు డబ్బులు పెట్టొచ్చు. రూ.50 గుణిజాల్లో మొత్తాన్ని జమ చేయవచ్చు. ముఖ్యంగా, ప్రతినెలా డబ్బులు కట్టాలనే నిబంధన లేదు. మీ సౌకర్యాన్ని బట్టి ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేయొచ్చు. ఒక ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతా మాత్రమే తెరవాలి. సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేర్ల మీద రెండు ఖాతాలు తెరవడానికి అవకాశం ఉంటుంది. కవలలు లేదా ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన సందర్భాల్లో నిబంధనల ప్రకారం మినహాయింపులు ఉంటాయి.

చదువు కోసం మధ్యలో డబ్బులు తీసుకోవచ్చా?  

కూతురి ఉన్నత చదువుల కోసం ఖాతాలోని డబ్బుల్లో కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకునే అవకాశం ఉంది. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా పదో తరగతి పూర్తి చేసిన తర్వాత, ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటి నుంచి చదువు ఖర్చుల కోసం గత ఆర్థిక సంవత్సరం చివర్లో ఉన్న ఖాతా నిల్వలో 50 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. ఇందుకు చదువుకు సంబంధించిన ఆధారాలు చూపాల్సి ఉంటుంది. అలాగే అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలకు అనుగుణంగా ఖాతాను ముందుగానే మూసివేసే అవకాశం ఉంది. పన్ను విషయానికి వస్తే, ఈ పథకంలో జమ చేసే మొత్తానికి పాత పన్ను విధానంలో వర్తించే పరిమితుల మేరకు మినహాయింపు పొందవచ్చు. కొత్త పన్ను విధానంలో ఈ పెట్టుబడిపై ఆ మినహాయింపు ఉండదు. ఖాతాపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ సమయంలో అందే మొత్తం పన్ను మినహాయింపు పరిధిలో ఉంటాయి. కాబట్టి ఖాతా తెరవడానికి ముందు మీ పన్ను విధానాన్ని బట్టి ప్రయోజనాలను పరిశీలించడం మంచిది.

Google వార్తల్లో మమ్మల్ని మీ ప్రాధాన్య వనరుగా జోడించండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.