Indiramma House: పేదలకు తెలంగాణ సర్కార్ బంపర్ గిఫ్ట్.. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్

Indiramma House: తెలంగాణలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీపి కబురు అందించారు. బుధవారం (నవంబర్ 25) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, త్వరలోనే మూడు, నాలుగో విడతల్లో మిగిలిన అర్హులందరికీ ఇళ్లను అందిస్తామని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఉచిత రిజిస్ట్రేషన్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు సొంతింటి భారాన్ని మరింత తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ లబ్ధిదారులకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఉచితంగానే సేల్ డీడ్లు అందించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల విలువైన ఆస్తిని ఉచిత రిజిస్ట్రేషన్‌తో పాటు అవిభక్త భూమి వాటా (UDS) హక్కుతో ఇవ్వడం పేద కుటుంబాలకు భారీ ఆర్థిక ఊరటనివ్వనుంది.
మలక్‌పేట, కుత్బుల్లాపూర్ టవర్లకు టీజీ రెరా గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ నగరంలో లక్ష ఫ్లాట్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మలక్‌పేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ హౌసింగ్ టవర్లకు తాజాగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) నుంచి అధికారిక ఆమోదం లభించింది. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ రెరా చైర్మన్ శ్రీనివాస రాజు నుంచి అనుమతి పత్రాలు అందుకున్నారు. తెలంగాణ చరిత్రలో ఒక ప్రభుత్వ గృహనిర్మాణ ప్రాజెక్టుకు రెరా గుర్తింపు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: IPL 2027: ఒకే ఐపీఎల్ వేలం.. ఒకరు 41, మరొకరు 15.. ఇదేం కాంబినేషన్ బాబోయ్
రుణాల సౌకర్యం, నిర్మాణ నాణ్యతకు భరోసా
ఇందిరమ్మ టవర్లకు రెరా అనుమతులు లభించడంతో లబ్ధిదారులకు రెట్టింపు ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి రూ.11 లక్షల వ్యయం అవుతుండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన రూ.6 లక్షల వాటాను నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందడం ఇప్పుడు మరింత సులభతరం అవుతుంది. అలాగే నిర్మాణంలో జాప్యం జరిగినా, నాణ్యత లోపించినా లబ్ధిదారులు నేరుగా రెరాకు ఫిర్యాదు చేసే చట్టబద్ధమైన హక్కు లభించింది.
ఏడాదిలోపే ఫ్లాట్లు అప్పగించేలా ప్లాన్
ఓఆర్ఆర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ప్రతి చోటా 480 ఫ్లాట్ల చొప్పున నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక వేయగా, ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో పనులు ప్రారంభమయ్యాయి. శంకుస్థాపన జరిగిన ఏడాదిలోపే నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారుల చేతికి తాళంచెవులు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. పారదర్శకమైన ఎంపిక, రెరా పర్యవేక్షణ, ఉచిత రిజిస్ట్రేషన్ కలయికతో హైదరాబాద్ పేదల సొంతింటి కల త్వరలోనే సాకారం కానుంది.

Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు
Bomb Threat: నవంబర్ 26న ముంబై తరహా దాడులంటూ హెచ్చరిక.. హైదరాబాద్‌లో హై అలర్ట్
New Rules: పెళ్లి చేసుకుంటున్నారా? అయితే ఈ కొత్త రూల్ తెలుసుకోవాల్సిందే
Food Poisoning: బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు.. హైదరాబాదులో కలకలం