శుక్రవారం, నవంబర్ 27, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

IPL 2027: ఒకే ఐపీఎల్ వేలం.. ఒకరు 41, మరొకరు 15.. ఇదేం కాంబినేషన్ బాబోయ్

IPL 2027

IPL 2027: ఐపీఎల్ 2027 మినీ వేలం కోసం ఆటగాళ్ల నమోదు ప్రక్రియలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈసారి వేలంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్న వారిలో అఫ్గానిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ అత్యధిక వయసున్న ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు బీహార్‌కు చెందిన 15 ఏళ్ల యువ క్రికెటర్ వాసుదేవ ప్రసాద్ సింగ్ అతి తక్కువ వయసున్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు. వీరిద్దరి మధ్య ఏకంగా 26 ఏళ్ల వయసు తేడా ఉంది. ఒకరు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఏళ్ల అనుభవం సంపాదించిన ఆటగాడు కాగా.. మరొకరు ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్.

నబీ అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటికే..

మొహమ్మద్ నబీ 41 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. బీహార్‌కు చెందిన వాసుదేవ ప్రసాద్ సింగ్ వయసు కేవలం 15 ఏళ్లు. వీరిద్దరి మధ్య 26 ఏళ్ల వ్యత్యాసం ఉంది. నబీ 2009లో అఫ్గానిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటికి వాసుదేవ పుట్టి కూడా లేడు. ఇప్పుడు ఇద్దరూ ఒకే ఐపీఎల్ వేలం నమోదు జాబితాలో చోటు సంపాదించడం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

నబీ ఖాతాలో భారీ అంతర్జాతీయ అనుభవం

మొహమ్మద్ నబీ అఫ్గానిస్థాన్ క్రికెట్‌లో కీలక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు ఆ దేశం తరఫున మూడు టెస్టులు, 181 వన్డేలు, 155 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 33 పరుగులు చేసి 8 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 3,801 పరుగులతో పాటు 181 వికెట్లు సాధించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 2,509 పరుగులు చేసి 111 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ జట్టుకు ఉపయోగపడే ఆటగాడిగా నబీకి మంచి గుర్తింపు ఉంది.

ఇది కూడా చదవండి: Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి.. ఏపీలో మూడు రోజుల పాటు వానలు

ఐపీఎల్‌లోనూ నబీకి అనుభవం

ఐపీఎల్‌లో మొహమ్మద్ నబీ ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 215 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోనూ ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2024లో ముంబై ఇండియన్స్ తరఫున చివరిసారిగా ఐపీఎల్‌లో కనిపించాడు. ఇప్పుడు మరోసారి వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరోవైపు 15 ఏళ్ల వాసుదేవకు ఈ నమోదు ప్రక్రియ పెద్ద వేదికపై తన ప్రతిభను నిరూపించుకునే దిశగా తొలి అడుగుగా చెప్పొచ్చు.

1,220 మంది ఆటగాళ్ల నమోదు.. తుది జాబితా ఎప్పుడంటే?

ఐపీఎల్ 2027 వేలం కోసం మొత్తం 1,220 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 939 మంది భారతీయులు కాగా, 281 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే పది ఫ్రాంచైజీలు 184 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం లేదా జట్టులోకి తీసుకోవడంతో ప్రస్తుతం 66 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వీటిలో 25 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. అయితే నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ తుది వేలంలో పాల్గొనే అవకాశం ఉండదు. ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల పేర్లను ఎంపిక చేసిన తర్వాత తుది జాబితా విడుదల చేస్తారు. ఐపీఎల్ అధికారిక ప్రకటన ప్రకారం డిసెంబర్ 4న తుది వేలం జాబితా విడుదల కానుంది. డిసెంబర్ 16న గోవాలో మినీ వేలం జరగనుంది.

Google వార్తల్లో మమ్మల్ని మీ ప్రాధాన్య వనరుగా జోడించండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.